నవతెలంగాణ – మిర్యాలగూడ
వెనకబడిన తరగుతులకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభత్వం కట్టుబడి వున్నదని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని చేపట్టి ప్రజలను చైతన్యపరిచి రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం బీసీ నాయకులపై ఉందని శాసన మండలి సభ్యులు, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ నాయకులు తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఏమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ బీసీ లకు రిజర్వేషన్ పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో తీర్మానం చేసిందని కేంద్రప్రభుత్వానికి బిల్లు కాపీ పంపడం జరిగిందని చెప్పారు. బిల్లు అమలు పరచకుండా గవర్నర్ వద్ద బిల్లును పెండింగ్ లో పెట్టించింది కేంద్ర ప్రభుత్వమని తెలిపారు.ప్రతి బీసీ బిడ్డ బిల్లు అమలు కోసం ఉద్యమం చేపట్టి బీజేపీ నాయకులపై ఒత్తిడి తేవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.బిల్లు ఆమోదం పొందే వరకు బీసీ నాయకులు సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ రెండు నాలుకలా దొరణితో బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనీర్ మాలోత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని కోరారు.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు పరిచే విషయంలో ఏర్పడని ఆటంకం బీసీ రిజర్వేషన్లు అమలుపరిచే విషయంలో ఆటంక పరచడం తగదన్నారు. బీసీ సంఘం నాయకులు తమ్ముడబోయిన అర్జున్ మాట్లాడుతూ రిజర్వేషన్ అమల పరిచే వరకు ఉద్యమం ఆగదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



