గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు
మంత్రివర్గం సిఫారసు చేసే పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు
మాజీ ఎమ్మెల్సీ అమీర్‌ఖాన్ దాఖలు చేసిన ఐఏ ఇతర పిటిషన్లకు జత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా చేపట్టబోయే ఎమ్మెల్సీ నియామకాలకు గత సుప్రీకోర్టు ఆదేశాలు అడ్డంకులు కావని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మంత్రి వర్గం సిఫారసు చేసే పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్, ప్రభుత్వం తరపున స్టాండింగ్ కౌన్సిల్ దేవిన సెఘల్, న్యాయవాది గౌరవ్ అగర్వాల్, ఎమ్మెల్సీ కోదండరాం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, ఇతర న్యాయవాదులు హాజరయ్యారు. అలాగే ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తరపున సీనియర్ న్యాయవాది సంజరు ఎం నూలీ ఇంప్లీడ్ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారని, ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. కాగా నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకొని, ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి కొత్త పేర్లను ప్రతిపాదించేలా మంత్రి వర్గానికి మార్గం సుగుమం చేయాలన్నారు. ఈ ప్రతిపాదనలపై నిర్ణయం విషయంలో గత సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకి కాకుండా గవర్నర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని, ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్, గవర్నర్ కోటాలో కొత్తగా చేపట్టబోయే నియామకాలకు గత ఆదేశాలు అడ్డుకాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో గవర్నర్‌కు స్వేచ్ఛ ఉంటుందని మరోసారి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అలాగే అమీర్‌ఖాన్ దాఖలు చేసిన ఐఏతో పాటు ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామన్నారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
ఈ కేసు పూర్వాపరాలు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ ఆనాటి రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. రాజకీయ నేపథ్యం ఉందని చెబుతూ ఆ ఇద్దరి పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని ఇద్దరూ వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతేడాది జనవరి 13న కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫారసు చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండగా తమ కోటాలో మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాలకు చెందిన సుదీర్ఘ వాదనల తర్వాత 2024, మార్చి 17న హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల నామినేషన్లను తిరస్కరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు తీర్పులో వెల్లడించింది. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీఖాన్ల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేయగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. వారు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో 2024, ఆగస్టు 4న తమకు న్యాయం చేయాలని కోరుతూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని వారు సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత.. గతేడాది ఆగష్టు 13 న కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగిస్తోంది.
గత ఆదేశాలు అడ్డంకులు కావు
- Advertisement -
- Advertisement -



