పశ్చిమాసియా వార్ ప్రభావంతో పెరిగిన నిర్మాణ వ్యయం
ముడిసరుకు కొరతతో కుదేలవుతున్న కన్స్ట్రక్షన్ రంగం
భారీగా పెరిగిన సిమెంట్, ఇనుము ధరలు
పైపులు, ఇసుక రేట్లు సైతం పెరుగుదల
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణదారులపై భారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఇల్లెందు
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడిసరుకు కొరత ఏర్పడింది. దాంతో నిర్మాణరంగంలో సిమెంట్, స్టీల్, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇల్లు నిర్మించుకునే వారికి, బిల్డర్లకు నిర్మాణ వ్యయంలో పెంపుదల కనిపిస్తోంది. ఈ ప్రభావం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులపైనా పడింది. ఈనెల 1వ తేదీ నుంచి సిమెంట్ ధరలు పెరిగాయి. బ్రాండ్‌ను బట్టి ఒక్కో బస్తా రూ. 10 నుంచి రూ.25 వరకు పెరిగింది. పైపులు, విద్యుత్‌వైర్లు, సిరామిక్ బాత్ ఫిట్టింగ్స్, టైల్స్ ఇలా ప్రతి ఒక వస్తువు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిని వస్తువుల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు అంటున్నాయి.
ఇంధన ధరల పెరుగుదలతో రవాణాచార్జీలు అధికమవుతుండటం నిర్మాణ వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. సాధారణంగా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు రూ.12 లక్షల్లో నిర్మాణం చేయాలనుకునే వారికి పెరిగిన ధరలతో రూ.16 లక్షల వ్యయం అవుతోంది. నిర్మాణ సమయంలో చేసుకున్న అగ్రిమెంట్ కంటే దాదాపు 10శాతం నుంచి 20శాతం వరకు ధరలు పెరగటంతో బిల్డర్లపై, ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులపై భారం పడుతోంది. ధరలు పెరుగుదలతో మెటిరియల్ కాంట్రాక్టు తీసుకున్న మేస్త్రీలు ఇంటి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లాగా ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణరంగ వస్తువుల రేట్లు ఏరోజుకారోజే అనేలా మారుతుండటం గమనార్హం.
సిమెంట్ రూ.50వరకూ పెంపు
ఈ వారంలో ఒక్కో బస్తా సిమెంట్‌పై రూ.50 వరకూ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంబూజా ప్లస్ సిమెంట్ ధర 1వ తేదీ ముందు వరకు బస్తా రూ.310 ఉండగా ఇప్పుడు రూ.325కు చేరింది. సాగర్ సిమెంట్ రూ.240 నుంచి రూ.265కు చేరింది. మిగతా కంపెనీల ధరలు సైతం రూ.10 నుంచి రూ.25 వరకూ పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.280-320 వరకు ఉన్న బస్తా వచ్చేవారం నాటికి రూ.320-370కి పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాల మాట. సిమెంట్ కంపెనీలు ఉపయోగించే పెట్రోలియం కోక్ ధర 130 నుంచి 165 డాలర్లకు చేరటం, ఇండస్ట్రియల్ డీజిల్ రేటు రూ.23.75 పెరగటం వంటి కారణాల వల్ల ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది.
స్టీల్ ధరలు సైతం భారీగా పెంపు
ఐరన్ ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1వ తేదీ నాటికి స్టీల్‌పై టన్నుకు రూ.5వేల నుంచి రూ.8వేల వరకూ ధరలు పెరిగాయి. స్టీల్ టన్ను రూ.2వేల వరకూ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి చమురు, ఇంధన ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా సిమెంట్, ఐరన్ ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు అంటున్నాయి. గత 15 రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 39శాతం, బొగ్గు 14శాతం, పెట్‌కోక్ 18శాతం మేర ధరలు పెరిగాయి. సిమెంట్, ఐరన్ ఉత్పత్తి, రవాణాలో ఇంధనం కీలకం కాబట్టి ధరలు పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
మొన్నటి వరకు తిరుపతి స్టీల్ 8 ఎంఎం రాడ్ రూ.210 ఉండగా ఇప్పుడు రూ.245కు చేరింది. 10ఎంఎం రాడ్ రూ.300-350, 12 ఎంఎంరాడ్ రూ.350-480, 16 ఎంఎం రాడ్ రూ.830-900, వైజాగ్ స్టీల్ 8ఎంఎం రాడ్ రూ.160-200, 10 ఎంఎం రాడ్ రూ.290- 350, 12 ఎంఎం రాడ్ 385-450, 16 ఎంఎం రాడ్ రూ.1290-1450 కి పెరిగాయి. మేకులు కేజీ రూ.80-100కు పెరిగాయి. స్టీల్ సెకండరీ రకం కేజీ మార్చి 1న రూ.58 ఉంటే ఇప్పుడు రూ.60, స్టీల్ ప్రైమ్ కిలో గతనెల మొదట్లో రూ.74 ఉంటే ఇప్పుడు రూ.80కి చేరింది.
ఇతర వస్తువుల ధరల్లోనూ వ్యత్యాసం
ఇంటి నిర్మాణానికి ప్రధానంగా ఉపయోగించే సిమెంట్, ఐరన్‌తో పాటు డీజిల్ ధరలు పెరగటంతో ఇసుక, తదితర రవాణాఖర్చులు కూడా పెరిగాయి. పైపులు ఇతరత్ర వస్తువుల ధరల్లోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రిన్స్ డ్రెయినేజీ పైపులు 4 ఎంఎం రూ.350-550కి పెరిగాయి. రెడ్ కలర్ పైపు రూ.500-750కి, స్పాంజ్ కట్టం రూ.100 -130, కంకర 8 ఎంఎం ట్రాక్టర్ రూ.2,800-4000, కంకర 20 ఎంఎం ట్రాక్టర్ లోడ్ రూ.3,000-4000, గోదావరి ఇసుక ట్రాక్టర్ తొట్టి లెవల్ రూ.5,000-7,000, బాడీలోడ్ రూ.4,500-5,000 వరకూ పెరిగాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మరికొంత పెంచి ఇవ్వాలి: సంగెం గంగ, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు
యుద్ధం కారణంగా నిర్మాణరంగ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతన్న దృష్ట్యా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.5లక్షలకు బదులు రూ.6లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం వారిని వేడుకుంటున్నా. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి నిర్మాణం వెనకబడుతుంది. ఒక్కొక్కరిపై 30శాతం అదనంగా భారం పడుతోంది. ఇంకా చాలా ఇండ్లు 70శాతం మేరనే పూర్తయ్యాయి. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తే మంచిది.
యుద్ధం పెేరుతో ధరల పెంపు దారుణం : కామ నాగరాజు, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ), ఇల్లెందు మండల కార్యదర్శి
యుద్ధం కారణంగా 40శాతం మేర వివిధ వస్తువుల ధరలు పెంచారు. ఐరన్, సిమెంట్, పైపులు, ఇతర వస్తువుల ధరలు 40శాతం మేర అమాంతం పెంచారు. యుద్ధం పెరుతో గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెంచడంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. పెరుగుతున్న ధరలను ప్రభుత్వం సమీక్షించి నిర్మాణరంగానికి మేలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అరకొర నిర్మాణాలు సాగుతున్నాయి.



