మార్క్‌ఫెడ్ కేంద్రాలు లేక దక్కని మద్దతు ధర
వర్షాలతో దిగుబడి రాక.. రేట్లు లేక వ్యథలు
ఎకరానికి నాలుగు క్వింటాళ్లకు బదులు రెండింటికే పరిమితం
క్వింటాకు రూ.8,682 మద్దతు ధర…
రూ.5వేలే చెల్లిస్తున్న వ్యాపారులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖరీఫ్‌లో సాగు చేసిన పెసర పంటకు కనీస మద్దతు ధర కరువైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ.8,682 మద్దతు ధర ఎక్కడా అమలు కావటం లేదు. రబీలో ఎలాగూ మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి కనీసం ఖరీఫ్‌లోనైనా వీటి ద్వారా గిట్టుబాటు ధర పొందుదామని ఆశించిన రైతులకు నిరాశే ఎదురయింది. ఓవైపు కోతల సమయంలో అధిక వర్షాలు వచ్చి పంట దెబ్బతిన్నది. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చోట రెండు క్వింటాళ్లే వచ్చింది. మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే కనీసం గిట్టుబాటు ధరైనా దక్కుతుందని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 70వేల ఎకరాలకు పైగా పెసర సాగు చేయగా 20 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్క్‌ఫెడ్ కేంద్రాల ఏర్పాటు జాప్యమవుతుండటంతో ప్రయివేటు వ్యాపారులు అరకొర ధరలకే పెసలు కొంటున్నారు.
క్వింటాకు రూ.3వేల వరకు నష్టం
మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు అరకొర ధరలు మాత్రమే పెడుతున్నారు. తద్వారా క్వింటాకు రూ.3వేల వరకు రైతులు నష్టపోతున్నారు. గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పెసలు గరిష్ట ధర రూ.8,000, కనిష్ట ధర రూ.3000, నమూనా ధర రూ.5,700 మాత్రమే నమోదయ్యాయి. బుధవారం రూ.6,050గా ఉన్న నమూనా, రూ.4వేలు నమోదైన కనిష్ట ధరలు గురువారానికి రూ.350 నుంచి వెయ్యి వరకు పడిపోయాయి. మార్కెట్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే స్థానికంగా కొనుగోళ్లు చేసే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కొంటున్నారు. మార్కెట్ ధరలపై సుమారు రూ.500-1000 వరకు తక్కువ ధర పెడుతున్నారని రైతాంగం వాపోతోంది. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధర పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు.
గణనీయంగా తగ్గిన దిగుబడి
ఈ సీజన్‌లో పంట కోతకు వస్తున్న దశలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిశాయి. ఈ వానలకు అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాలు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. వచ్చిన దిగుబడి కూడా నాణ్యత సరిగా లేదని వ్యాపారులు తిరకాసు పెడుతున్నారు. భారీగా ధరలు తగ్గిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 4 క్వింటాళ్లకు పైగా పెసలు దిగుబడి వస్తుంది. కానీ మూడు ఎకరాలు దూస్తే డబ్బా అవుతున్నాయని, డబ్బాకు 8 బస్తాలు అంటే దీన్ని ఆరబెట్టి, తరుగు తీస్తే 6 బస్తాల చొప్పున దిగుబడి వచ్చినట్టు. పంట కోత సమయంలో వర్షాలు పడి గింజలు ఊబడాలు (గింజకు బూజు) అయ్యాయని రైతులు వాపోతున్నారు. దిగుబడులు సగానికి సగం తగ్గాయని అంటున్నారు. కాబట్టి మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా రూ.8,682 మద్దతు ధరకు కొనుగోలు చేస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుతుందని రైతులు, రైతుసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. సీజన్‌లో ఇప్పటికే కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన మార్క్‌ఫెడ్ కేంద్రాల నిర్వాహకులు శిక్షణ పేరుతో జాప్యం చేస్తుండటంతో రైతాంగం నష్టపోతోంది. గత ఖరీఫ్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెయ్యి టన్నుల పెసలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది.
సిబ్బంది శిక్షణలో ఉన్నారు : సునీత, మార్క్‌ఫెడ్ మేనేజర్, ఖమ్మం జిల్లా
ప్రస్తుతం మార్క్‌ఫెడ్ కేంద్రాల నిర్వాహక సిబ్బంది శిక్షణలో ఉన్నారు. ఇదీ పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలు తెరుచుకుంటాయి. దీనికి వారానికి పైగా సమయం పట్టొచ్చు. గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపాం. ఇప్పుడు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పెట్టుబడులు కూడా రావట్లేదు
పెసర పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్‌లో అమ్మితే గిట్టుబాటు కావటం లేదు. జెండా పాట రూ.6,500 ఉందని మార్కెట్‌కు వస్తే ఒక్కరోజులోనే రూ.300కు పైగా తగ్గించారు. క్వింటా రూ.4వేలకు కూడా కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా రావటం లేదు. పెసర సాగుకు ఎకరానికి రూ.10వేల పెట్టుబడి పెట్టాలి. ఎకరానికి నాలుగు క్వింటాళ్లు రావాల్సింది రెండు క్వింటాళ్లే వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావు. పెట్టుబడి కూడా పూడదు.
రాయల వెంకయ్య, కొణిజర్ల మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తక్షణం మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్రం ప్రకటించిన పెసల మద్దతు ధర క్వింటా రూ.8,682 చొప్పున కొనుగోలు చేయాలి. ఇప్పటికే మార్క్‌ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సింది.. ఆలస్యమ వుతుండటంతో ఒక్కో క్వింటాపై రైతులు రూ.3వేల వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వర్షాలకు దెబ్బతిన్న పెసర పంటను కూడా కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలి.
బొంతు రాంబాబు, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి