మోడీ మౌనం..ప్రజలపై భారాలు
29న యుద్ధ వ్యతిరేక నిరసన
అసెంబ్లీలో తీర్మానం చేయాలి : వామపక్ష, యుద్ధవ్యతిరేక కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న ఏకపక్ష యుద్ధంతో దేశంలో చమురు ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యుద్ధవ్యతిరేక కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నాయకులు కె నారాయణ, ఈటీ నర్సింహా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, సీనియర్ నాయకులు డీజీ నర్సింహా రావు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ, ఎం హన్మేష్, సీపీఐ(ఎంఎల్)ఎన్‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్ములు జేవీ చలపతిరావు, కె గోవర్దన్, ముస్లీం సంఘాల నేతలు మునీర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29న హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు అమెరికన్ యుద్ధోన్మానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించ నున్నట్టు ప్రకటించారు. ఈ లోపు ఆయా పార్టీల్లోని ప్రజాసంఘాలు ఉమ్మడిగా సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో మోడీ యుద్దోన్మాద అమెరికాకు అనుకూలంగా వ్యవహరించటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇరాన్‌పై ట్రంప్ జస్ట్ సంతోషం, సరదా కోసం యుద్ధం చేస్తున్నానని ప్రకటిస్తుంటే..మోడీ మౌనంగా ఉండటమేంటని ప్రశ్నించారు. దేశ అలీన విధానానికి వ్యతిరేకంగా ఆయన చర్యలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంతో దేశంలోని కార్పొరేట్లు మాత్రమే లాభాలు దండుకుంటున్నారని చెప్పారు.
ఇప్పటికే వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరలను అధికారికంగానే పెంచారనీ, ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనీ, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగక తప్పదని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల వల్ల, అక్కడ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న మనపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కార్మికులు, గిగ్ వర్కర్ల ఉపాధిపై ప్రభావం ఉంటుందన్నారు. అమెరికా విస్తరణ కాంక్షతో ట్రంప్ బరితెగించి వ్యవహరిస్తున్నాడనీ, వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేయటం, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేయటం, క్యూబాపై బెదిరింపులకు దిగటం, ఈ విధంగా స్వంతంత్రత కలిగిన దేశాలను ఆక్రమించుకునేందుకు అమెరికా కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మోడీ వైఖరి పూర్తిగా మన సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టినట్టుగా ఉందని విమర్శించారు. 29న జరిగే ర్యాలీలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యుద్ధంతో పెరుగుతున్న ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



