Tuesday, March 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సామ్రాజ్యవాదం

ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సామ్రాజ్యవాదం

- Advertisement -

మొత్తానికి ఈ వారంలో ముడి చమురు అంతర్జాతీయ ధర బ్యారెల్‌కు వంద డాలర్ల హద్దు దాటేసింది. 110 డాలర్లకు చేరింది కూడా. ఇరాన్‌ మీద సామ్రాజ్యవాదుల దాడి ప్రారంభం అవడానికి ముందు వరకూ ముడిచమురు ధర బ్యారెల్‌కు 69 డాలర్లుగా ఉండేది. అందుచేత కేవలం ఒక్క వారంలో అమాంతం ఇంతలా పెరిగిపోవడం చాలా తీవ్రమైన విషయం. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడం వలన వాస్తవంగా ఏర్పడిన చమురు సరఫరా కొరత వలన పెరిగిన ధర కన్నా, చమురు కొరత ఏర్పడబోతోందన్న ముందస్తు అంచనాల వలన పెరిగిన ధర ఎక్కువ. 1973 నాటి పెరుగుదలకు ఇది పూర్తిగా భిన్నం. అప్పుడు ధర పెరుగుదలకు చమురు కొరత కారణం కాదు. చమురు ఉత్పత్తి దేశాలు ముడి చమురు ధరను పలు రెట్లు పెంచివేయడం కారణం. 2008లో, 2022లో కూడా చమురు ధరలు పెరిగాయి. కాని వాటికన్నా కూడా ప్రస్తుత పెరుగుదల విభిన్నమైనది.

2008లో గాని, 2022లో గాని చమురు ధరలు పెరగడం స్వల్పకాలిక స్వభావం కలిగినవి. 2008లో చైనా నుండి చమురుకు డిమాండ్‌ పెరిగింది. నైజీరియా నుండి, పశ్చిమాసియా నుండి చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ఈ రెండు కారణాలూ స్వల్పకాలికమైనవే. అందుకే ఆ పెరుగుదల నిలవలేదు. అదేవిధంగా 2022లో కూడా జరిగింది. అప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధం సాకుతో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. కాని రష్యా ఆ ఆంక్షలను బేఖాతర్‌ చేసి తన చమురు సరఫరాలో ఎక్కువ భాగాన్ని కొనసాగించింది. దానికి తోడు అమెరికా నుండి కూడా ముడి చమురు యూరపు దేశాలకు సరఫరా అయింది. అయితే దాని ధర ఎక్కువ. ఏమైనా, ఆ పెరుగుదల కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఇప్పుడు ధర పెరగడానికి కారణం అమెరికా-ఇజ్రాయిల్‌ తన మీద సాగిస్తున్న దాడికి ఇరాన్‌ నుంచి వచ్చిన ప్రతిస్పందన. ఈ యుద్ధం కొనసాగినంత కాలమూ పెరిగిన చమురు ధర కూడా అలానే కొనసాగుతుంది. ఈ యుద్ధం ముగిసేది ఎప్పుడో కనుచూపు మేరలో కానరావడం లేదు. హార్ముజ్‌ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్‌ సరఫరాలే కాదు, అనేక దేశాల నుండి సరఫరాలు రవాణా అవుతాయి. వాటన్నింటి మొత్తం కలిపితే రష్యా నుండి సరఫరా అయ్యే ముడి చమురు కన్నా రెట్టింపు ఉంటుంది. ఇటువంటి సమయంలో చమురు ధరల విషయంలో స్పెక్యులేషన్‌ను చల్లార్చేబదులు, డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ సమస్యను కొట్టిపారేశాడు. యుద్ధం ద్వారా సాధించవలసిన లక్ష్యాలతో పోల్చినప్పుడు ”ఈ పాటి చిన్న మూల్యం” చెల్లించక తప్పదు అన్నాడు.

ముడి చమురు ధరల పెరుగుదల ఇదే విధంగా కొంత కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం చాలా ప్రగాఢంగా పడుతుంది. చమురు ఉత్పత్తుల కొనుగోలు చేసే వినియోగదారుల మీద ప్రత్యక్షంగా భారం పడి ద్రవ్యోల్బణానికి దారి తీయడం జరుగుతుంది. దానికన్నా ముఖ్యంగా చమురు ఇంధనాన్ని ఉపయోగించి చేసే అనేక ఉత్పత్తుల, సేవల ధరలు కూడా పెరుగుతాయి. ఎరువుల ధరలు పెరుగుతాయి. వాటిని ఉపయోగించేది వ్యవసాయంలో. అందుచేత ఆహారధాన్యాల ధరలు పెరుగుతాయి (రైతులకు లభించే ధరలు తగ్గిపోకుండా ఉంటే). ఇవిగాక, అన్ని సరుకుల రవాణా చార్జీలు పెరుగుతాయి. దాంతో ద్రవ్యోల్బణానికి గట్టి ఊపు వస్తుంది.

అమాంతం వచ్చిపడిన అదనపు లాభాల వలన ప్రయోజనం పొందినవారు వాటిని బ్యాంకుల్లో భద్రంగా దాచుకుంటారు. అందువలన వారి అదనపు ఆదాయం నుండి మార్కెట్‌ లోకి అదనపు డిమాండ్‌ రూపంలో వచ్చేది ఏమీ ఉండదు. కాని ధరలు పెరిగినందువలన తక్కినవారు తమ డిమాండ్‌ను కుదించుకోవలసి వస్తుంది. అందువలన ప్రపంచం మొత్తం మీద డిమాండ్‌ కుదించుకుపోతుంది. దాని వలన ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం పెరుగుతుంది. ఒకవేళ చమురు ఉత్పత్తిదారులు కావాలనే ఈ ధర పెరుగుదల తెచ్చిపెట్టారనుకోండి (1970 దశకంలో మాదిరిగా). అప్పుడు ఆ ధరల పెరుగుదల వలన నష్టపోతున్న దేశాల ప్రభుత్వాలు తమ దేశాల్లో ఆర్థిక మాంద్యం పెరిగిపోకుండా నివారించడానికి తమ తమ స్థూల డిమాండ్‌ను పడిపోకుండా నిలబెట్టవచ్చు.

అందుకు అవసరమైన ద్రవ్య విధానాన్ని, నగదు సరఫరా విధానాన్ని చేపట్టవచ్చు (అయితే 1970 దశకంలో ప్రభుత్వాలు ఏవీ ఇలా చేయ లేదనుకోండి). కాని చమురు సరఫరాకే కొరత ఏర్పడి దానివలన ముడిచమురు ధర పెరిగినప్పుడు నెలకొనే ఆర్థిక మాంద్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టడం సాధ్యం కాదు. వాస్తవానికి చమురు సరఫరాలో కొరత ఏర్పడి నప్పుడు దానిని అధిగమించడానికి ఆర్థిక మాంద్యమే పరిష్కారం అవుతుంది. అందుచేత ఇప్పుడు ముడిచమురు ధర పెరిగినందువలన ద్రవ్యోల్బణంతో కూడిన ఆర్థిక మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనివార్యంగా తలెత్తుతుంది. ఈ ఆర్థిక మాంద్యం చమురు ఉత్పత్తి దేశాలతో సహా అన్నింటిలోనూ తలెత్తుతుంది (అయితే చమురు ఉత్పత్తి దేశాలు దీని ప్రభావాన్ని తగ్గించేవిధంగా తమ తమ దేశాల్లో చర్యలు చేపట్టగలుగుతారు). ఇక మూడవ ప్రపంచ దేశాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. దానికి అదనపు కారణాలు తోడవుతాయి.

చమురు ధరలు పెరిగినందువలన దాన్ని దిగుమతి చేసుకునే దేశాల విదేశీ మారక చెల్లింపు ఖాతాలు కరిగిపోయి లోటు పెరుగుతుంది. అదే చమురు దిగుమతి చేసుకునే సంపన్న దేశాల విషయంలోనైతే, వాటికి బ్యాంకులు రుణాలివ్వడానికి తయారుగా ఉంటాయి. ఆ బ్యాంకుల దగ్గర చమురు ఎగుమతి చేసే దేశాల నుండి వచ్చిన అదనపు ధనం చేరుతుంది. దానినుండి చమురు దిగుమతి చేసుకునే సంపన్న దేశాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వగలుగుతాయి. కాని మూడవ ప్రపంచ దేశాలకు ఆ విధంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. రుణాలు పొందగలిగిన స్తోమత మూడవ ప్రపంచ దేశాలకు లేదని బ్యాంకులు, ఇతర అంతర్జాతీయ రుణ దాతలు భావించడమే ఇందుకు కారణం.

ఇప్పుడు పెరిగిన విదేశీ చెల్లింపుల లోటును పూడ్చుకోడానికి మూడవ ప్రపంచ దేశాలు మరింత క్లిష్టమైన షరతులకు లోబడి విదేశీ రుణాలు పొందడానికి పూనుకోవలసి వస్తుంది. అప్పుడు వారి కరెన్సీల విలువలు పడిపోవడమే కాక, షరతుల్లో భాగంగా మరింత కఠినమైన ”పొదుపు చర్యలను” అమలు చేయడానికి ఈ దేశాలు తలొగ్గవలసి వస్తుంది. లేదా తమ దేశాల్లోని విలువైన ఖనిజ సంపదను తాకట్టు పెట్టడమో లేక అమ్ముకోడమో చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే కరెన్సీ విలువ పడిపోతుందో అప్పుడు ద్రవ్యోల్బణం మరింత విజృంభిస్తుంది. ఎందుకంటే కరెన్సీ విలువ పడిపోవడం వలన ముడిచమురు దిగుమతులు మరింత ఖరీదౌతాయి. దానితోబాటు ఈ దేశాల్లో మాంద్యం మరింత ఎక్కువ తీవ్రతను కనపరుస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల కొనుగోలుశక్తి పడిపోయి సరుకుల, సేవల వినియోగం తగ్గిపోయి అది మాంద్యానికి దారి తీయడం ఒక్కటే కారణం కాదు.

విదేశీ రుణదాతలు ”పొదుపు చర్యల” పేరుతో విధించే షరతుల కారణంగా ప్రజల వినిమయశక్తి మరింత పడిపోతుంది. మరింతగా మాంద్యం నెలకొంటుంది. దాని వలన ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయి. అమెరికా చట్టవిరుద్ధంగా ప్రారంభించిన ఈ అనైతిక యుద్ధాన్ని వెంటనే నిలుపు చేయాలని డిమాండ్‌ చేయడం, అమెరికాపై ఒత్తిడి పెంచడం ఈ మూడవ ప్రపంచ దేశాలకు మరింత ఎక్కువ అవసరం. ప్రపంచ చమురు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఇండియా చాలా తీవ్రంగా దెబ్బ తింటుంది. హార్ముజ్‌ జల సంధి ద్వారా రవాణా అయ్యే చమురులో 84 శాతం చైనా, ఇండియా, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలే కొనుగోలు చేస్తాయి. అందుచేత ఈ హార్ముజ్‌ జలసంధిని మూసివేయడం వలన ప్రపంచవ్యాప్త చమురు ధరలు పెరగడమేకాక, ప్రత్యేకించి ఈ దేశాల మీద ప్రత్యక్ష, తక్షణ ప్రభావం పడుతుంది. సకాలంలో, భౌతికంగా చమురు సరఫరాలు ఈ దేశాలకు అందకుండా పోతాయి. వాటిలో ఇండియా ఒక ముఖ్యమైన దేశం.

అయితే కొద్దికాలం వరకూ రష్యా నుండి చమరు దిగుమతి చేసుకోడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి ‘అనుమతి’ ఇచ్చాడనుకోండి. దాని వలన పెరిగిన చమురు ధరల ప్రభావం కొద్దికాలం వరకూ పడకపో వచ్చు (ఇలా మన దేశానికి కావలసినవి దిగుమతి చేసుకోడానికి వేరే మూడవ దేశం ‘అనుమతి’ ఇవ్వడం అనేది ఎనిమిది దశాబ్దాల మన స్వాతంత్య్రానికి, దానిని సాధించిన జాతీయోద్యమానికి అత్యంత అవమానకరం. అలా అనుమతిచ్చే అధికారాన్ని సవాలు చేసి తిరస్కరించేబదులు, ఆ ‘అనుమతిని’ నిస్సిగ్గుగా ఆమోదించడం మరింత అవమానకరం.). అయితే ఈ ‘అనుమతి’ కేవలం ఒక నెల రోజులవరకే ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో అమెరికా- ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాక్రమణ దాడిని ఖండిచి నిరసన తెలిపే బదులు మౌనం వహించడం భారత దేశానికి ఆత్మహత్యా సదృశం అవుతుంది.

వాస్తవానికి హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడానికి కారణం అమెరికా దాడి పట్ల మూడవ ప్రపంచ దేశాలలో వ్యతిరేకతను పెంచాలనుకోవడమే. ఇరాన్‌పై యుద్ధం అంటే మూడవ ప్రపంచ దేశాలన్నింటిపైనా యుద్ధమే అని వాటిని ఒప్పించడం కోసమే. ఇరాన్‌ సైనికాధికారులు ప్రపంచ చమురు ధరలు రానున్న రోజుల్లో ఏకంగా బ్యారెల్‌కు 200 డాలర్ల వరకూ పెరగవచ్చునని అంచనాలు వేస్తున్నారు. అదే గనుక జరిగితే, ఇక మూడవ ప్రపంచ దేశాల ప్రజల మీద నడ్డి విరిగే భారాలు పడక తప్పుదు! దానిని నివారించాలంటే ఈ దేశాలన్నీ అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా గట్టిగా నిలవక తప్పదు. మూడవ ప్రపంచ దేశాల మౌనం కొనసాగితే అవి మరొకందుకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ యుద్ధం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, దానితోబాటు మాంద్యం పెరుగుతున్నాయి.

ప్రజానీకపు ఆగ్రహాన్ని అతడు చవిచూడవలసి వస్తుంది. ఇంతకు ముందే అతగాడు ప్రజల్లో సానుకూలతను కోల్పోయాడు లెండి. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని తొందరగా ముగించడానికి ఇరాన్‌ మీద వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను ప్రయోగించడానికి పూనుకున్నాడనుకోండి. ఇప్పటి వరకూ ప్రపంచంలో అణ్వాయుధాలను ప్రయోగించడానికి పూనుకున్న దేశం ఏదైనా ఉందీ అంటే అది అమెరికాయే. దాని వలన ఏర్పడిన వినాశనం వంటిది మళ్లీ జరగకుండా అమెరికన్‌ ప్రభుత్వాన్ని ఇప్పటికి మూడు సందర్భాల్లో అంతర్గత సలహాదారులు తమ జోక్యంతో నిలవరించగలిగారు. మళ్లీ ఈసారి నివారించడానికి మొత్తం ప్రపంచం యావత్తూ ఏకమై ముక్తకంఠంతో గొంతెత్తి, అంతర్జాతీయ చట్టాలకు పాతర వేస్తున్న అమెరికా తీరును ఖండించకపోతే ఈ మారు వినాశనాన్ని నివారించడం సాధ్యం కాకపోవచ్చు.

(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -