ప్రభుత్వ ఉపాధ్యాయుని దాతృత్వం అభినందనీయం
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మందనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సయ్యద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జాన్ అఫ్గాన్,కాంప్లెక్స్ హెచ్‌ఎం దాసరి మంజుల,గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక, ఉపసర్పంచ్ శశిరేఖ సుదర్శన్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పాఠశాలపై సమాజంలో విశ్వాసం బలపడుతుందని పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ పాఠశాలను ముందుకు నడిపిస్తున్న హెచ్‌ఎం సయ్యద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు సయ్యద్ మాట్లాడుతూ వార్షికోత్సవాల వంటి వేదికలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీసే అవకాశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో నమ్మకం పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, అంబేద్కర్ గ్రామ కమిటీ చైర్మన్ సుదర్శన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వంగ సరిత,పాఠశాల శ్రేయోభిలాషి మరియు ‘బ్యాక్ టు బ్యాక్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంచు దేవదాసు,వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుని దాతృత్వం
మందనపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఎండి సయ్యద్ వార్షికోత్సవ వేదికపై విశేష ప్రకటన చేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం స్థాపించిన ‘ఎస్ఎల్ ఫౌండేషన్’ ద్వారా ఒక పేద విద్యార్థిని డిగ్రీ వరకు చదివించే పూర్తి బాధ్యత స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ ప్రకటనకు హాజరైన ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ సయ్యద్ సేవాభావాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు మరింత ప్రేరణనిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.




