ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కి ఒప్పందాలు
అంగన్వాడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్‌జీ పాఠాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అనాథ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు అంగన్వాడీ టీచర్లకు వృత్తి నైపుణ్యాభివృద్ధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డి.అనసూయ సీతక్క సమక్షంలో ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కితో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో పాటు అంగన్వాడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ద్వారా పాఠాలను చెప్పించనున్నారు.
ప్రభుత్వ సంరక్షణలో, శక్తి సదన్‌లో ఉంటున్న ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు జీఎంఆర్ ఏరో అకాడమీతో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం ఈ ఏడాది మార్చి నెల నుంచి శంషాబాద్‌లో ప్రారంభం కానుంది. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇచ్చి, ప్రయివేటు, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయడం శిక్షణ ప్రధాన లక్ష్యం. మొదటి విడతలో 20 మంది అనాథ యువతకు శిక్షణ అందించనున్నారు. ఆ తర్వాత బ్యాచ్‌ల వారిగా అర్హులందరికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ హెడ్ కె.అనంతరామన్, ఆపరేషన్స్ హెడ్ ప్రీతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శతి ఓజా హాజరయ్యారు.
ఫిక్కి-ఫ్లోతో డిజిటల్ అండ్ ఇండిస్టీ నైపుణ్యాలు
పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ బాలికలకు ఇండిస్టీ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ శిక్షణ అందించేందుకు ఫిక్కీ లేడిస్ అర్గనైజేషన్‌తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు చేసుకుంది. స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్, అవినాష్ ఇన్ స్టిట్యూట్ సహకారంతో ఈ సర్టిఫైడ్ కోర్సులను అనాథ బాలికలకు నేర్పిస్తారు. క్లాస్ రూం టు కార్పోరేట్ జాబ్ లక్ష్యంగా 30 గంటల శిక్షణా మాడ్యూల్ ద్వారా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్దం అయ్యేలా తీర్చిదిద్దనున్నారు. మొత్తం 300 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఉద్యోగాలు వారికి లభించేలా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ ప్రతిభా కుందా, స్వస్తిక్ వికాస్ ఫౌండేషన్ ప్రాచి త్రివేది షా, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లకు 6 నెలల సర్టిఫికేట్ కోర్సు
అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడానికి అజీమ్ ప్రేమ్ జీ యునివర్సిటీతో కలిసి 6 నెలల ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు అమలు చేయనున్నారు. ఎర్లి చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌కు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. అంగన్వాడీ టీచర్లందరికి ఈ మోడల్ ద్వారా శిక్షణ ఇస్తారు. 30 గంటల ఆన్‌లైన్ సెషన్లు, 6 రోజుల ప్రత్యక్ష శిక్షణ కలిపి 6 నెలల వ్యవధిలో కోర్సు పూర్తి అవుతుంది. విజయవంతంగా పూర్తి చేసిన వారికి అజీమ్ ప్రేమ్‌జీ యునివర్సిటీ సర్టిఫికేషన్ అందిస్తుంది. టీచింగ్, కేరింగ్, పిల్లల బోధనలో సామర్థ్య పెంపు ఈ శిక్షణలో ప్రధానాంశాలు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 3-6 సంవత్సరాల చిన్నారుల పాఠశాల సంసిద్ధతను మెరుగుపరచడమే లక్షంగా ఈ కోర్సు పని చేయనుంది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు అజీమ్ ప్రెమ్‌జీ ఫౌండేషన్ తెలంగాణ హెడ్ ఎం.శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు.
అనాథలకు భవిష్యత్తు కల్పించడం ప్రభుత్వం లక్షం : మంత్రి సీతక్క
ఒప్పందాలు కుదిరిన సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ”అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. వారికి కేవలం ఆశ్రయం కాదు… భవిష్యత్తు కల్పించడమే తమ లక్ష్యం. పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహాగా ఎదిగేలా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ కర్తవ్యం” అని తెలిపారు. సమగ్ర పునరావాసం, శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక నిర్ణయంగా నిలవనుందని ఆమె స్పష్టం చేశారు. మూడేండ్లలోపు చిన్నారుల కోసం క్రష్ సెంటర్లు ఏర్పాటు చేసి, అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
అనాథ యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



