3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్య సాధనలో అదే కీలకం : బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం రెండేండ్లలోనే రూ.73,360 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, లక్ష ఉద్యోగాలను సృష్టించామన్నారు. బుధవారం హైటెక్స్‌లో ‘బయోఏషియా- 2026’ అంతర్జాతీయ సదస్సులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ 2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం’ పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’కు శ్రీకారం చుట్టామన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే తెలంగాణ నెక్స్ట్ – జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030), తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్, 1బయో ఇంక్యూబేటర్, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ఫార్మా విలేజెస్, తెలంగాణ లైఫ్ సైన్సెస్‌ను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.
ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనీ, జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు, ఎగుమతుల్లో అయిదో వంతు వాటా తెలంగాణదేనని వివరించారు. ఈ ఏడాది సదస్సులో సనోఫీ, ఒపెల్లా, వ్యాక్సిండో యానిమల్ హెల్త్, ట్రెడెన్స్, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు.
బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే తదితర దేశాల నిపుణులతో లైఫ్ సైన్సెస్ రంగంలో రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్వహించిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం అయ్యేందుకు దోహదం చేస్తాయన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రతినిధులతో పాటు దేశ విదేశాల నుంచి మొత్తం 4,394 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారనీ, కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాల కోసం 4వేలకు పైగా అత్యున్నత స్థాయి బిజినెస్ టూ బిజినెస్(బీ2బీ) సమావేశాలకు ఇది వేదికగా నిలిచిందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రభుత్వం కేవలం వ్యాపారంగా చూడట్లేదనీ, సామాజిక బాధ్యతగా చూస్తున్నామన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



