Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం జాతరలో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత

మేడారం జాతరలో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత

- Advertisement -

తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించటంతో పాటు ఆ ప్రాంతం మొత్తంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. ప్రధానంగా జాతరకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యం, టాయిలెట్‌ బ్లాక్స్‌ల వద్ద నిరంతర నీటి సదుపాయం, ప్రభుత్వ శాఖల వద్ద తాగునీటి సౌకర్యం, పెద్ద సంఖ్యలో టాయిలెట్‌ బ్లాకుల నిర్మాణం చేపట్టారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం- మిషన్‌ భగీరథ ఆధ్వర్యంలో దాదాపు 5,500 తాత్కాలిక నల్లాలు ఏర్పాటు చేశారు.

వీటిలో 517 బ్యాటరీ ఆఫ్‌ టాప్‌లు, 47 సిస్టెర్న్‌లు, 312 సిస్టర్న్‌ టాప్‌లు , 10 చలివేంద్రాలున్నాయి. 2024 జాతరలో 5,222 నల్లాలు మాత్రమే ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 5,500 నల్లాలు ఏర్పాటుచేశారు. రూ. 13.70 కోట్ల వ్యయంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం- మిషన్‌ భగీరథ శాఖ ద్వారా 57 పనులను చేపట్టింది. గతంలో ఉన్న సదుపాయాలకు అదనంగా, ఒక అధికుల సామర్ధ్యం కలిగిన బోర్‌వెల్‌, రెండు బోరెవెల్‌-పంప్‌లు, ఐదు కొత్త సిస్టర్‌లు, ఒక కొత్త ఓఎచ్‌ఎస్‌ఆర్‌, 26 టాయిలెట్‌ బ్లాక్స్‌లు, ఒక క్యూ-లైన్‌ నిర్మాణం, మరో 9 ఇతర పనులను చేపట్టి పూర్తి చేశారు. మేడారం ప్రధాన ఆలయం పరిసరాలు, జాతీయ రహదారి, పార్కింగ్‌ ప్రాంతాలు, వివిధ గ్రామాల నుండి వచ్చే దారులు, చెరువుల సమీపంలో ఈ తాగు నీటి సౌకర్యంతోపాటు టాయిలెట్‌లను ఏర్పాటు చేసారు.

ఐదువేల మంది శానిటేషన్‌ సిబ్బంది
మేడారంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ఈనెల 28 నుండి 31 తేదీ వరకు జరిగే జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇంతటి భక్త జన సమూహానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈసారి అధిక సంఖ్యలో ఐదువేల మంది పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. రోజుకు మూడు షిఫ్టులుగా పనిచేసి, జాతర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్తను ఏరివేస్తారు.

పంచాయితీ రాజ్‌ శాఖ ఆధ్వర్యం లో చేపడుతున్న ఈ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు, జాతర మొత్తాన్ని 25 సెక్టారు లుగా విభజించి 526 పర్యవేక్షక అధికారులను నియమించారు. సేకరించిన వ్యర్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి, 100 టాక్టర్లను ఏర్పాటు చేశారు. దుమ్ము, ధూళి లేవకుండా రహదారులపై నీటిని స్ప్రే చేయడానికి 150 వాటర్‌ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో, వరంగల్‌ నగర పాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీల నుండి 40 స్వచ్ఛ ఆటోలను, 16 డోజర్లు, 13 మొబైల్‌ టాయిలెట్‌లు, 18 స్వీపెంగ్‌ యంత్రాలు, 12 జేసీబీలను ప్రత్యేకంగా ఉపయోగించనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ తెలిపింది.

5,700 టాయిలెట్ల ఏర్పాటు
మేడారానికి వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం మేడారంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల్లో దాదాపు 5,700 టాయిలెట్లను తాత్కాలికంగా నిర్మించారు. మొత్తం 285 టాయిలెట్‌ బ్లాక్సులుగా ఏర్పాటు చేసి వీటిని పరిశుభ్రంగా నిర్వహించేందుకు 255 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -