Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఖైదీలను సన్మార్గంలో నడిపించాలి

ఖైదీలను సన్మార్గంలో నడిపించాలి

- Advertisement -

అప్పుడే జైలు అధికారులు విజయం సాధించినట్టు : కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఘనంగా ముగిసిన జైళ్ల శాఖ డ్యూటీ మీట్‌లు


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నేరస్థులను సన్మార్గులుగా మార్చినప్పుడే జైళ్ల అధికారులు విజయం సాధించినట్టవుతుందని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీసు అకాడమీలో గత మూడ్రోజులుగా సాగుతున్న అఖిల భారత జైళ్ల శాఖాధికారుల డ్యూటీ మీట్‌ ముగింపు ఉత్సవానికి బండి సంజయ్ గురువారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిస్థితుల ప్రభావంతో పాటు ఇతర కారణాలతో నేరస్థులుగా మారినవారిని ఓపిక, వృత్తి నైపుణ్యంతో దేశవ్యాప్తంగా జైళ్ల అధికారులు వారిలో పరివర్తన తీసుకురావటానికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్ర జైళ్ల శాఖ ఈ డ్యూటీ మీట్‌ను ఘనంగా నిర్వహించి జాతీయస్థాయిలో మంచి పేరును సంపాదించుకున్నదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 1330 కారాగారాలుండగా అందులో 141 కేంద్ర కారాగారాలు, 34 మహిళా కేంద్ర కారాగారాలు ఉన్నాయనీ, వీటిలో 5.34 లక్షల మంది ఖైదీలు ఉన్నారని చెప్పారు. జైళ్లకు వచ్చిన నేరస్థుల్లో పరివర్తన తీసుకొస్తున్న అధికారులు.. జాతీయస్థాయిలో శాంతి భద్రతలను పరిరక్షించటంలో వారు కూడా పాలు పంచుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. జైళ్లలో అవసరమైన సంస్కరణలు తీసుకొచ్చి చక్కటి కరెక్షనల్‌ సర్వీసును అమలయ్యేలా కేంద్ర హౌం శాఖ తగిన ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నదని చెప్పారు. డ్యూటీమీట్‌లో పాల్గొన్న దేశవ్యాప్త జైలు అధికారులను ఆయన అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జైళ్లలో సాగుతున్న ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయటానికి అవసరమైన చర్యలను కేంద్ర హౌం శాఖ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జైళ్ల ఆధునీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. అఖిల భారత డ్యూటీ మీట్‌ను ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను ఆయన అభినందించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. మూడ్రోజులపాటు సాగిన డ్యూటీ మీట్‌లో రాష్ట్ర జైళ్లశాఖ అధికారులు 21 బంగారు పతకాలతో పాటు మొత్తం 28 పతకాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని అభినందించారు. వరంగల్‌లో నిర్వహిస్తున్న ఆధునిక కేంద్ర కారాగారానికి కేంద్ర హౌం శాఖ తగిన సహాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే నల్గొండ, వరంగల్‌తో పాటు ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న ఆధునిక డీఅడిక్షన్‌ సెంటర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన జైళ్ల శాఖాధికారులు పోలీసు డ్యూటీ మీట్‌ ఘనంగా ముగియడానికి తగిన సహకారాన్ని అందించారని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తగిన ప్రోత్సాహాన్ని అందజేసిందని ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు డ్యూటీ మీట్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది నిర్వహించిన ముగింపు కవాతు, ఇతర విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకర్షించాయి. అనంతరం డ్యూటీమీట్‌లో నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచినవారికి బండి సంజయ్, శ్రీనివాస్‌రెడ్డిలు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా కురుస్తున్న వర్షంలోనే విజేతలు బహుమతులను అందుకున్నారు. చివరలో బండి సంజయ్ డ్యూటీ మీట్‌ ముగిసినట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -