Wednesday, March 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరు గ్యారంటీలపై చట్టబద్ధతకు ప్రయివేటు బిల్లు

ఆరు గ్యారంటీలపై చట్టబద్ధతకు ప్రయివేటు బిల్లు

- Advertisement -

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
వెలుగుమట్ల, మూసీ బాధితుల తరపున పోరాడుతాం : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్‌ సమావేశంలో కేటీఆర్‌

నవతెలంగాణ-గండిపేట
ఆరు గ్యారంటీలకు ఇచ్చిన హామీ ప్రకారం చట్టబద్దత కల్పించేందుకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ తరపున ఒక ప్రయివేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్‌ టాక్టిక్స్‌ ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీని తమ పార్టీ నుంచి పోయిన వ్యక్తికి ఇచ్చారని, ఒక్క సెలెక్ట్‌ కమిటీ, స్టాండింగ్‌ కమిటీ, పిటిషన్స్‌ కమిటీ, ఇలా డిప్యూటీ స్పీకర్‌ కూడా శాసనసభలో లేరని అన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై మంగళవారం రంగారెడ్డి జిల్లా గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.. ఈసారి కాంగ్రెస్‌ పెడుతున్న బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వారి హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించామని చెప్పారు. పార్టీ సీనియర్‌ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డితోపాటు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ బడ్జెట్‌ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, బడ్జెట్‌లో అధ్యయనం చేయాల్సిన ఆంశాలపై వివరించినట్టు తెలిపారు.

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు మొదటి క్యాబినెట్‌లో చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందన్నారు. అందుకే ఈ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుపై తాము ఒక ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదన్నారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇండ్లు కోల్పోయిన వెలుగుమట్ల, మూసీ బాధితులు, పేద దళిత, గిరిజనుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ‘రాహుల్‌ బంధు’ కాకుండా.. రైతుబంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ఢిల్లీకి కప్పం కట్టడానికి డబ్బులు లూటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

మధు పార్క్‌ రిడ్జ్‌ అపార్టుమెంట్‌కు జీరో వాల్యూ చేయడం కాదు.. అసలు జీరో వాల్యూ ఎవరికైనా ఉన్నదంటే అది రేవంత్‌రెడ్డికేనని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదని, తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని బహిరంగ సభల్లో తానే చెప్తున్నాడని తెలిపారు. డే ఎకానమీని నాశనం చేసి, నైట్‌ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని చెప్పానని, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. తాము కట్టిన ఫ్లై ఓవర్లు, ఇండ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి కాంగ్రెస్‌ కట్టినవని సీఎం చెప్పుకుంటున్నారని తెలిపారు. రైతులు, వికలాంగులు, మహిళలు, కార్మికులు, అన్ని వర్గాల వారికి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపైనా అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులోనూ నిర్వహిస్తామనన్నారు. శాసనమండలి, శాసనసభ మధ్య సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -