Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయం'ఆయుష్మాన్‌'లో 'ప్రయివేటు' దోపిడీ

‘ఆయుష్మాన్‌’లో ‘ప్రయివేటు’ దోపిడీ

- Advertisement -

రెట్టింపు చేసి బిల్లులు వసూలు
పరిమితి దాటిందంటూ పేషెంట్ల నుంచి మళ్లీ దోచుకుంటున్న వైనం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలపై అవగాహన కల్పించని కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ప్రయివేటు ఆస్పత్రులకు ఆదాయ వనరుగా మారింది. ఈ పథకం పేరుతో కోట్ల రూపాయాల్లో పోగేసుకుంటున్నాయి. చికిత్సకయ్యే ఫీజులను రెట్టింపు చేసి బిల్లులు వేస్తున్నాయి. పథకం కింద నిర్దేశించిన రూ.5 లక్షల పరిమితి దాటిందంటూ.. ఇటు పేషెంట్ల నుంచి కూడా దోచుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకంపై పర్యవేక్షణ లోపించటం కారణంగానే ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ తీవ్రమైందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ పథకం రిజిస్టరైన ప్రభుత్వ ఆధ్యర్యంలో నడిచే ఆస్పత్రుల్లో మాత్రం వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలపై కేంద్రం అవగాహన కల్పించని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మేధావులు వివరిస్తున్నారు. ఈ పథకాన్ని నడిపిస్తున్న నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) విడుదల చేసిన ఒక నివేదిక సమాచారాన్ని విశ్లేషిస్తే ఈ విషయం వెల్లడవుతున్నది.

న్యూఢిల్లీ : ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద ఎన్‌రోల్‌ అయిన (ఎంప్యానెల్డ్‌) ఆస్పత్రులు అధికం ప్రభుత్వ ఆధర్యంలో నడిచేవే. కానీ ప్రభుత్వ పర్యవేక్షణ లోపించటం, ప్రజల్లో అవగాహన కల్పించని కారణంగా లబ్దిదారులు ప్రభుత్వ ఆస్పత్రులను ఆదరించటం లేదు. వైద్య చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రులను ఎక్కువ సంఖ్యలో ఆశ్రయిస్తున్నారు. పథకం ప్రారంభం నుంచి ప్రయివేటు ఆస్పత్రుల్లోనే రోగుల చేరికలు ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక ఇక్కడ వైద్య సేవలకు అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువే.

దీంతో పథకం కింద ఏడాదికి ఓ కుటుంబానికి అందే రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని మించితే.. దాని భారం ప్రజల మీద పడుతున్నది. ప్రయివేటు ఆస్పత్రులు ధన దాహంతో వ్యవహరిస్తున్నాయి. వైద్య చికిత్సలకు రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బీమా కవరేజీ త్వరగా మించిపోవటం.. ఆ తర్వాత రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయటం పరిపాటిగా మారిపోయింది. దీంతో చివరకు ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల సంఖ్య 31,005గా ఉన్నది. ఇందులో 45 శాతం ప్రయివేటు ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లోనే రోగుల చేరికలు (హాస్పటలైజేషన్‌) 52 శాతంగా ఉన్నాయి. చికిత్సల మొత్తం ఖర్చులలో 66 శాతం ఇక్కడే నమోదవుతున్నాయి. చికిత్సకు అయ్యే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ.. ఈ పథకం కింద ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారన్న విషయాన్ని ఇది తెలియజేస్తున్నది.

ఈ పథకం 2018లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ పథకం కింద రూ.1.29 లక్షల కోట్ల విలువైన 9 కోట్లకు పైగా చికిత్సలు జరిగాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకం కింద హిమోడయాలసిస్‌ (14 శాతం), జ్వరం (4 శాతం), కడుపు ఇన్ఫెక్షన్లు (3 శాతం), పశువుల కాటు (3 శాతం) చికిత్సలు అధికంగా నమోదవుతున్నాయి. అలాగే 2024-25 ఏడాదికి గానూ జనరల్‌ మెడిసిన్‌, ఆప్తల్‌మాలజీ, జనరల్‌ సర్జరీలు టాప్‌-3 మెడికల్‌ సేవలలో ఉన్నాయి.

చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు రోగులు
ఈ పథకం కింద రోగులు స్వంత రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. అయితే వైద్య చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నవారు, ఇతర రాష్ట్రాల నుంచి వైద్య చికిత్స కోసం వస్తున్నవారు.. ఈ రెండింటిలోనూ యూపీ, పంజాబ్‌ రాష్ట్రాలు ముందున్నాయి. ఈ పథకం కింద ఎక్కువ మంది రోగులు చికిత్సల కోసం చండీగఢ్‌(19 శాతం), యూపీ(13 శాతం), గుజరాత్‌(11 శాతం), ఉత్తరాఖండ్‌(8 శాతం), పంజాబ్‌(8 శాతం) లకు తరలుతున్నారు. అలాగే యూపీ (24 శాతం), మధ్యప్రదేశ్‌ (17 శాతం), బీహార్‌ (16 శాతం), పంజాబ్‌ (7 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌ (7 శాతం)ల నుంచి ఎక్కువ మంది పేషేంట్లు వైద్య చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్తున్నారు.

‘ప్రయివేటును కట్టడి చేయాలి’
ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ను కేంద్రం 2018లో ప్రారంభించింది. ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఉచిత, నగదురహిత వైద్య సేవలను అందిస్తుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని ఈ పథకం అందిస్తుంది. ఈ మొత్తాన్ని కుటుంబంలోని ఒకరు లేదా అందరూ ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలని మేధావులు సూచిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యాన్ని ప్రయివేటు రంగానికి అప్పగించినట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవల విషయంలో ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఇలాంటి ఆస్పత్రులపై పర్యవేక్షణ పెరగాలనీ, ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

డిజిటల్‌ సేవలు ఇలా..
దేశవ్యాప్తంగా రోగుల మెడికల్‌ హిస్టరీని పలు ఆస్పత్రుల్లోని వైద్యులు తెలుసుకునేలా డిజిటల్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ను కేంద్రం రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా రోగుల హెల్త్‌ రికార్డులను లింక్‌ చేస్తున్నది. ఇప్పటికే 50 కోట్ల మంది హెల్త్‌ రికార్డులను అనుసంధానించింది. ప్రస్తుతం ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురుకికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఖాతా (ఆభా) ఉన్నది. వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 3.8 లక్షల ఆరోగ్య కేంద్రాలు (38 శాతం), 5.8 లక్షల మంది వైద్య సిబ్బంది (26 శాతం) డిజిటల్‌గా నమోయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -