Sunday, March 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రయివేటు మెంబర్‌ బిల్లు

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో ప్రయివేటు మెంబర్‌ బిల్లు

- Advertisement -

అధికార పార్టీ ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించాలి
కాంగ్రెస్‌, బీజేపీ మద్దతివ్వాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం అసెంబ్లీలో ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, న్యాయ నిపుణుల బృందం, లీగల్‌ సెల్‌తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ బి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, సోమ భరత్‌, మోహన్‌రావు, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బిఎస్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకుని అన్ని వర్గాలనూ మోసం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. వాటికి అభయహస్తం పేరుతో చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2023, డిసెంబర్‌ ఏడున ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారని వివరించారు. అదేరోజు మొదటి సంతకం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. వారం రోజుల తర్వాత ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంలోనూ ఆ అంశాన్ని ఉంచారని వివరించారు. రెండున్నరేండ్లయినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆ దస్త్రం కనిపించడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికే ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును శుక్రవారం ప్రవేశపెడతామని వివరించారు. స్పీకర్‌ కార్యాలయాన్ని, మండలిలో చైర్మెన్‌ కార్యాలయాన్ని కలిసి ఈ బిల్లును అనుమతించాలని కోరతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును సభలో అనుమతించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్టీఆర్‌ హయాంలో ప్రయివేటు మెంబర్‌ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తు చేశారు. ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును ప్రభుత్వాలు ఆమోదించే సాంప్రదాయం రాష్ట్రంలో ఉందన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం తాము పెడుతున్న ప్రయివేటు మెంబర్‌ బిల్లును కాంగ్రెస్‌ ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ కూడా మద్దతివ్వాలని కోరారు. అధికార పక్షం, ప్రతిపక్షం కోరుతున్నందున ఈ బిల్లు ఆమోదం సులభంగా జరుగుతుందని వివరించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తేనే మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పెన్షన్లు రూ.నాలుగు వేలకు పెంపు, వికలాంగుల పెన్షన్‌ రూ.ఆరు వేలకు పెంపు, రైతుభరోసా ఏడాదికి రూ.15 వేలు చెల్లింపు, కౌలు రైతులకు రూ.15 వేలు ఆర్థిక సాయం, విద్యార్థులకు రూ.ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డులు అమలవుతాయని చెప్పారు. వాటికి చట్టబద్ధత కల్పిస్తున్నందున ప్రజలకు హక్కుగా మారుతుందని అన్నారు. ఒకవేళ అమలు చేయకుంటే కోర్టును ఆశ్రయించడానికి అవకాశముంటుందన్నారు. వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అవకాశం ఉండబోదని చెప్పారు. ప్రయివేటు మెంబర్‌ బిల్లుకు మద్దతు కోసం అవసరమైతే సభ్యులందరికీ లేఖ రాస్తామని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తేవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -