ఐదు నెలల కనిష్టానికి పీిఎంఐ
యూఎస్ టారిఫ్‌ల ప్రభావం
న్యూఢిల్లీ : దేశంలో ప్రయివేటు రంగ కార్యకలాపాల్లో స్తబ్దత చోటు చేసుకుంటుంది. డిమాండ్ బలహీనంగా ఉండటం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వ్యాపార ఆశావాదంపై ప్రతికూల ప్రభావం చూపాయని హెచ్‌ఎస్‌బిసి తన ఫ్లాష్ ఇండియా కంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ)లో తెలిపింది. ఈ పరిణామాలతో అక్టోబర్‌లో పిఎంఐ 59.9 కి పడిపోయిందని… ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి అని వెల్లడించింది. ఇది రాయిటర్స్ పోల్ అంచనా 61.2 కంటే తక్కువ. ఇంతక్రితం సెప్టెంబర్‌లో ఇది 61.0గా నమోదయ్యింది. మే నెల నుండి అత్యల్ప స్థాయి అయినప్పటికీ 50 మార్కు పైన ఉండటం వల్ల కొంత ఆశవాదం నెలకొంది. సేవల రంగంలో మందగించిన వృద్ధి ఈ క్షీణతకు ప్రధాన కారణం. అయితే తయారీ రంగం సెప్టెంబర్‌లో నాలుగు నెలల కనిష్ఠ స్థాయి నుండి కొంత కోలుకొంది. తయారీ పిఎంఐ 57.7 నుండి 58.4కి పెరగగా, సేవల వ్యాపార కార్యకలాపాల ఇండెక్స్ 60.9 నుండి 58.8కి పడిపోయింది.
ఈ ఏడాది మే నెల నుండి కొత్త ఆర్డర్‌లు నెమ్మదించాయి. ట్రంప్ టారిఫ్‌ల అనంతరం సేవల రంగంలో ఉత్సాహాం కోల్పోవడం దీనికి ప్రధాన కారణం. అయితే.. వస్తువుల ఉత్పత్తి సెప్టెంబర్ కంటే కొంచెం వేగంగా పెరుగుదలను నమోదు చేసింది. ప్రధానంగా తయారీ ఎగుమతులలో మందగింపునతో అంతర్జాతీయ డిమాండ్ ఏడు నెలల్లో అత్యంత బలహీనంగా నమోదయ్యింది. భారత ఎగుమతులపై అమెరికా అధిక సుంకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. రష్యన్ చమురు కొనుగోళ్లను ఇండియా ఆపకపోతే సుంకాలు మరింత ఎక్కువగానే ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ పదేపదే హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్‌లో యుఎస్‌కు ఎగుమతులు భారీగా తగ్గాయి. సెప్టెంబర్‌లో అమెరికాకు ఎగుమతులు 20.3 శాతం క్షీణించి 5.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇది వరుసగా ఐదో నెల పతనం కావడం గమనార్హం. మరోవైపు సెప్టెంబర్‌లో జిఎస్‌టి తగ్గించడం వల్ల ఖర్చు ఒత్తిడి తగ్గినప్పటికీ, కంపెనీలు ఈ ప్రయోజనాలను ఖాతాదారులకు బదిలీ చేయకుండా, అధిక కార్యకలాపాల ఖర్చులను భర్తీ చేయడానికి విక్రయ ధరలను పెంచాయి. వచ్చే ఏడాది వ్యాపారాలు ఒత్తిడిలో ఉండొచ్చనే అంచనాల్లో జిఎస్‌టి తగ్గింపు ప్రతి ఫలాలను వినియోగదారులకు బదిలీ చేయలేదని విశ్లేషించింది.
ప్రయివేటు రంగ కార్యకలాపాలు క్షీణత
- Advertisement -
- Advertisement -


