వచ్చే ఆదాయంలోనే ఈఎంఐలు, అప్పులు, వడ్డీలు కుటుంబమంతా కష్టపడినా అరకొర జీతాలే
మానసికంగా, శారీరకంగా ఒత్తిళ్లు భారమవుతున్న మధ్యతరగతి బతుకులు
భారత్‌లో మధ్యతరగతి ఉద్యోగుల
పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పేరుకే ఉద్యోగాలున్నా.. వస్తున్న జీతాలు అతి తక్కువ. ఏండ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాల్లో ఎలాంటి పెరుగుదల ఉండట్లేదు. కానీ ఏటా ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ఇంటి అద్దెలు మొదలు ప్రతినెలా ఈఎంఐలు, స్కూల్, కాలేజీ ఫీజులు, రోజువారీ ఖర్చులు అన్నీ పెరిగేవే. వచ్చే జీతం చాలక అప్పు చేస్తే, దానికి చెల్లించే వడ్డీలు మరింత అదనం. జీవితాన్ని గాడిన పెట్టుకోవడం కోసం మధ్యతరగతి జీవి సర్కస్ ఫీట్లే చేయాల్సి వస్తోంది. పట్టు తప్పితే…ప్రాణాల మీదకూ వస్తున్నది. ఏరోజుకారోజు ప్రయివేటు ఉద్యోగులు మానసిక, శారీరక ఆందోళనలతో తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు.
న్యూఢిల్లీ : దేశంలో మధ్యతరగతి ప్రయివేటు ఉద్యోగుల జీతాలు పెరగట్లేదు. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. వస్తున్న జీతం చాలక ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నారు. ఆదాయ, వ్యయాల్ని సమన్వ యం చేసుకోలేక సతమతమవుతున్నారు. అదనపు ఆదాయాల కోసం ఇతర మార్గాల్ని అన్వేషించాల్సి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తలు కలిసి పనిచేస్తున్నా, మారుతున్న జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా జీవితాలు ఉండట్లేదు. కుటుం బంలోని ఇద్దరు పిల్లల్ని స్థోమతకు తగినట్టు పెంచలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అనేక ఆసక్తికర అంశాలను దానిలో పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిని తన వేతనం గురించి మాట్లాడుతూ ‘వస్తున్న జీతం చాలక, పెరిగిన ఖర్చులు భరించలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీలో ఓ పబ్లిక్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంటి కిరాయి పెంచొద్దంటూ తన ఇంటి ఆ యజమానిని ప్రాధేయపడ్డాననీ, తన జీతంలో ఇప్పటికే సగభాగం కిరాయికే వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచుతారన్న హామీ నేపథ్యంలో చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో కొలువులకు వచ్చిన ఓ టెకీ, మరో యువ ప్రొఫెషనల్ ‘ఇక్కడికి ఎందుకొచ్చామా అని తలలు పట్టుకుంటున్నాం’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పూణే వంటి నగరాల్లో అద్దె ఇండ్ల యజమానుల్ని పోషించేందుకే ఉద్యోగాలు చేస్తున్నామేమో అని సందేహం కలుగుతుందని అక్కడి ఐటీ ఇంజినీర్ ఒకరు చెప్పుకొచ్చారు. పేరుకే వైట్ కాలర్ ఉద్యోగాలు. జీతాలు మాత్రం గొర్రెతోకే అంటూ పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పెరగని జీతాలతో మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం దిగజారిపోతున్నది.
పెరిగిన పని గంటలు
ఉద్యోగులు, సిబ్బందితో పుట్టెడు చాకిరీ చేయించుకునే సంస్థలు క్రమంగా పనిగంటల్ని పెంచేస్తున్నాయి. గతంలో ‘వర్క్ ఫ్రం హోం’ అంటే సంబరపడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు వెళ్లి పనిచేయడాన్నే ఇష్టపడుతున్నారు. ”ఆఫీస్‌కు వెళ్తే నిర్ణీత పనిగంటలు ఉంటాయి. వర్క్ ఫ్రం హోంలో దాదాపు 14 నుంచి 16 గంటలు పనిచేయాల్సి వస్తున్నదని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. అంత పని చేసినా, జీతాలు ఎప్పుడొస్తాయో చెప్పలేని స్థితి ఉందని చెప్పుకొచ్చారు. ‘ఇచ్చే జీతం టైంకి వస్తే చాలనుకుంటున్నాం. జీతం పెంపును ఆశించడం అత్యాశ అనే అనిపిస్తుంది’ అని మరో ప్రయివేటు సంస్థ ఉద్యోగి అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొన్ని సంస్థలైతే జీతాల పెంపు అనే డిమాండ్‌ను నిషిద్ధ పదంగా భావిస్తున్నాయి. ”నాకు జీతం చివరిగా ఏడాదిన్నర క్రితం పెరిగింది. ఈ ఏడాది జీతం పెరుగుదలను ఆశించే పరిస్థితులు కనిపించట్లేదు. పనిఒత్తిడి పెరిగింది. గతంలో కచ్చితమైన తేదీతో వచ్చే జీతాలు, ఇప్పుడు ఎప్పుడు వస్తాయో చెప్పలేక పోతున్నాం. ఉద్యోగం మానేసే పరిస్థితీ లేదు. మరో కంపెనీకి వెళ్లినా అక్కడా ఇదే పరిస్థితి’ అంటూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో గర్భాశయ నొప్పి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలతో బాధపడుతున్నానని నోయిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న క్రితికా శర్మ (30) చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కమ్యూనికేషన్స్‌లో పని చేసే సుస్మితా పక్రసి(34) మెరుగైన జీతం కోసం జర్నలిజాన్ని వదిలిపెట్టారు. ” పే స్లిప్ మీదే నేను ఎక్కువ సంపాదిస్తున్నా ను. అద్దె, కిరాణా సామాగ్రి, ఈఎంఐలు, ఆరోగ్య సంరక్షణ వంటి ఖర్చులతో పోలిస్తే, ఐదేండ్ల క్రితం నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు దానికంటే తిరోగమనంలో ఉన్నాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లాభాల్లో సంస్థలు
ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్న భారతీయ కంపెనీలు లాభాలు భారీగా గడిస్తున్నాయి. కంపెనీలోకల టాప్ పొజీషన్‌లో ఉండే వారికే పెద్ద ఎత్తున జీతాలు, ప్యాకేజీలు అందుతున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులకు మాత్రం తక్కువ వేతనాలే. అయాన్ అనే సంస్థ 1400 కంపెనీలపై ఒక సర్వే నిర్వహించింది. ఆయా కంపెనీల్లో ఉద్యోగుల స్థితిగతులు, పెరిగిన సంస్థల లాభాలను అధ్యయనం చేసింది. దానిలో ఇలాంటి అనేక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
నిజ వేతనాల్లో 130వ స్థానం
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ప్రకారం భారతదేశంలో నిజమైన వేతన వృద్ధి 130వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని ప్రయివేటు ఉద్యోగుల వేతనాలను పరిశీలించిన తర్వాత ఐఎల్‌ఓ ఈ నివేదికను వెల్లడించింది. జీతాల పెంపుదల విషయంలో 47 శాతం మంది అసంతృప్తితో ఉన్నారనీ, 25 శాతం మంది తటస్థంగా ఉంటే, 59 శాతం మంది జీతాల్లో తక్కువ పెరు గుదలను చూశామని చెప్పారు. ఎంట్రీ లెవల్ (0-3 ఏండ్ల అనుభవం) ఉద్యోగులు 31 శాతం మంది తాము తక్కువ వేతనాలు పొందుతున్నామని చెప్పారు. మధ్య స్థాయి (7-10 ఏండ్ల అనుభవం) ఉద్యోగుల్లో 18 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారు. జీతాల పెంపు లేనందున కనీసం కేంద్ర ప్రభుత్వం విధించే ఆదాయపు పన్నుల్లో మినహాయి ంపులు ఇచ్చినా, తమకు ఎంతో కొంత ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని పలువురు ఉద్యోగులు చెప్తున్నారు. పెరిగిన ఖర్చులతో పోల్చినప్పుడు పన్ను మినహాయింపు రూ.7 లక్షలను మించి ఉండాలని మిన్‌ఈఎంఐ సహవ్యవ స్థాపకులు, ఆర్థిక సలహాదారు సిద్ధార్థ్ జైన్ అన్నారు.
మోడీ ప్రచారం ఉత్తిదే…
భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, జీడీపీలో మెరుగైన వృద్ధిని సాధిస్తున్నామని మోడీ సర్కారు చేసుకుంటున్న ప్రచారంలోని డొల్లతనం ఆయా ఉద్యోగుల మాటల్లో వ్యక్తమవుతుంది. ప్రజలకు పొదుపు చేసే శక్తి సన్నగిల్లుతోంది. ఆ స్థానాన్ని పర్సనల్ లోన్‌లు, క్రెడిట్‌కార్డులు ఆక్రమించి, మధ్యతరగతి ఉద్యోగి భవిష్యత్‌ను ముందుస్తుగానే అప్పుల ఊబిలోకి లాగేస్తున్నాయి. 2024లో గృహ పొదుపు జీడీపీలో 18.1 శాతానికి పడిపోయింది. స్థూల దేశీయ పొదుపులు జీడీపీలో 30.7 శాతానికి తగ్గాయి.