యుఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు శివ మాట్లాడుతూ.. నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు కాస్మోటిక్ చార్జీలు విద్యార్థులకు ఇవ్వలేదని అలాగే పోస్టుమెట్రిక్ హాస్టల్ సంబంధించి అనేక సమస్యలు ముఖ్యంగా విద్యార్థులకు సంఖ్య అనుగుణంగా గదులు లేకపోవడం అద్దె భవనాలలో హాస్టల్స్ కొనసాగిస్తుండడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అందించే భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారో లేదో మరియు హాస్టల్ వార్డెన్ లు తను కేటాయించిన ప్రభుత్వ హాస్టల్లో ఏ రకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు మరియు వాచ్మెన్లు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తున్నారో లేదో అనే విషయాలపై ప్రతినెల సంబంధిత శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించాలని తెలియజేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హాస్టల్ నుండి విద్యార్థులు బయటకు వెళ్లడం తరచుగా జరుగుతున్నాయి అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 900 కోట్లు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని 900 కోట్ల ఫీజు రియంబర్స్ బకాయిలను విడుదల చేసి మిగిలిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసే రకంగా కృషి చేయాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్త విద్యార్థి ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నాయకులు సందీప్, విశాల్, విజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



