ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత హాస్యనటుడు అల్లురామలింగయ్య భార్య (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి కుటుంబంతోపాటు హీరోలు వెంకటేష్, నాగచైతన్య, సాయితేజ్, వరుణ్‌తేజ్, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటిశ్రీను, వి.వి.వినాయక్, శ్రీనువైట్ల, వశిష్ట తదితరులుతోపాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కనకరత్నమ్మ భౌతికకాయానికి నివాళి అర్పించారు. తల్లి మరణంతో చిరంజీవి భార్య సురేఖ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవ్వగా, ఆమె కొడుకు హీరో రామ్‌చరణ్ ఓదార్చారు. ముంబయిలో జరుగుతున్న ‘పెద్ది’ షూటింగ్‌ని వాయిదా వేసుకుని రామ్‌చరణ్ హైదరాబాద్ వచ్చారు. అలాగే నాయినమ్మ మరణ వార్త తెలుసుకున్న మనవడు అల్లుఅర్జున్ మైసూర్‌లో జరుగుతున్న షూటింగ్‌ని క్యాన్సిల్ చేసుకుని వచ్చారు. శనివారం మధ్యాహ్నం కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేటలో జరిగాయి.
కనకరత్నమ్మ నేత్ర దానం ఎందరికో స్ఫూర్తిదాయకం : చిరంజీవి
ఓసారి నేత్ర దానం గురించి నేను మా అత్తయ్యతో మాట్లాడాను. చనిపోయి బూడిదవ్వడం కంటే మరొకరికి వెలుగునివ్వడం మంచిదే కదా అన్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో నేను ముందుగా ఆమె ఇంటికి చేరుకున్నాను. ఈ విషయం తెలిసి అల్లు అరవింద్ బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి బయలు దేరుతూ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు, ఆమె ఇచ్చిన మాట గురించి ఆయనకు చెప్పాను. చాలా మంచిది. ఆమె చెప్పినట్లే చేయండి అని ప్రోత్సహించారు. వెంటనే మా బ్లడ్ స్వామినాయుడుకి ఫోన్ చేసి, ఎల్‌వి ప్రసాద్ ఐ హాస్పిటల్‌కి సమాచారం ఇవ్వమని చెప్పాను. ఇటువంటి సమయంలో మా అత్తయ్య చేసిన నేత్రదానం ఎందురికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.