– నవంబర్‌లో 1.8 శాతానికి పతనం
న్యూఢిల్లీ : భారత పారిశ్రామికోత్పత్తి రంగంలో అత్యంత కీలకమైన ఎనిమిది ప్రాధాన్యత రంగాలు పడకేశాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఈ మౌలిక వసతుల రంగాల ఉత్పత్తి ఏకంగా 1.8 శాతానికి మందగించినట్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. సిమెంట్, ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, విద్యుత్, బొగ్గు, స్టీల్, రిఫైనరీ తదితర ప్రధాన రంగాలు గతేడాది ఇదే నెలలో 5.8 శాతం వృద్ధిని కనబర్చగా.. గడిచిన నెలలో ఏకంగా 1.8 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని సూచిస్తోంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వీటి వాటా 40.27 శాతంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025 నవంబర్‌లో బొగ్గు ఉత్పత్తి పెరుగుదల 2.1 శాతానికి పరిమితమయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో ఇది 1.4 శాతం వృద్ధితో సరిపెట్టుకుంది. గడిచిన నెలలో చమురు ఉత్పత్తి 3.2 శాతానికి పడిపోయింది. సహజ వాయువు ఉత్పత్తి 2.5 శాతానికి, పెట్రోలియం రిఫైనరీ 0.9 శాతానికి పరిమితమయ్యాయి. ఎరువులు 5.6 శాతం, స్టీల్ 6.1 శాతం, సిమెంట్ 14.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. విద్యుత్ రంగం ఉత్పత్తి 2.2 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో ఎనిమిది ప్రాధాన్యత రంగాల ఉత్పత్తి 2.4 శాతానికి క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో 4.4 శాతం వృద్ధి నమోదయ్యింది. దీంతో పోల్చితే ప్రాధాన్యత రంగాల ఉత్పత్తి సగానికి కుంచించింది. మందగమనం వల్ల అధిక ధరలు, నిరుద్యోగం, ప్రజల ఆదాయాలు తగ్గడం తదితర పరిణామాలు వస్తు డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో కొనుగోళ్లు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం కీలక మౌలిక వసతుల రంగాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుతున్నాయని తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పరిశ్రమలు, ఉపాధి మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జవృద్ధి రేటు 7.8 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. సాధారణంగా దేశ జీడీపీలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ వాటా 27 శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి ప్రభావం మిగితా రంగాలపై ప్రత్యక్షంగా కనబడుతుంది. అలాంటి పారిశ్రామికోత్పత్తి పేలవమైన ప్రదర్శన కనబర్చినప్పటికీ జీడీపీ పరుగులు పెడుతోన్నట్టు మోడీ సర్కార్ గణంకాలను ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నిపుణులు విశ్లేషిస్తోన్నారు.
కీలక రంగాల ఉత్పత్తి పడక
- Advertisement -
- Advertisement -



