Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయండ్యూటీ మీట్‌లతో వృత్తి నైపుణ్యం పెరుగుతుంది

డ్యూటీ మీట్‌లతో వృత్తి నైపుణ్యం పెరుగుతుంది

- Advertisement -

జైళ్ల శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వార్షిక డ్యూటీ మీట్‌లు జైళ్ల శాఖ అధికారుల్లో వృత్తి నైపుణ్యాన్ని మరింతగా సానబడతాయని రాష్ట్ర ఐటీ, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హిమాయత్‌సాగర్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీస్‌ అకాడమీలో జరుగుతోన్న ఏడో అఖిల భారత జైళ్ల శాఖ అధికారుల డ్యూటీ మీట్‌ బుధవారం రెండో రోజున మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదనీ, అదే సమయంలో జైళ్ల శాఖలో సంస్కరణల పైనా ప్రత్యేక శ్రద్ధను వహించిందని శ్రీధర్‌బాబు అన్నారు. అఖిల భారత జైళ్లశాఖ అధికారుల డ్యూటీ మీట్‌ను రాష్ట్రంలో నిర్వహించటం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. జైళ్లలో ఖైదీలను సంస్కరించే విషయంలో అధికారులు, సిబ్బంది తలమునకలవుతారనీ, అదే సమయంలో డ్యూటీ మీట్‌లు వారిలో మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జైళ్లశాఖ అధికారులు, సిబ్బంది నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన మెచ్చుకున్నారు. డ్యూటీ మీట్‌లో భాగంగా జరిగిన వివిధ క్రీడల్లో గెలుపొందిన అధికారులు, సిబ్బందికి మంత్రి పతకాలను అందజేసి, అభినందిం చారు. జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ… ఈ డ్యూటీ మీట్‌ ద్వారా జైళ్ల శాఖలోని అధికారులు సిబ్బందిలో విధి నిర్వహణకు సంబంధించి నూతన ఆలోచనా విధానాలను ప్రేరేపించేలా వాతావరణాన్ని కల్పించటం జరిగిం దని తెలిపారు. ఈ సందర్భంగా 21 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల ను ఎంతగానో అలరించాయి. శాస్త్రీయ, జానపద నృత్యా లు, పాటలు, కర్నాటక-హిందుస్తానీ సంగీత కచేరీ లు ఈ కార్యక్రమంలో అధికారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాత్రి పొద్దుపోయేంత వరకు ఈ కార్యక్రమా లు పోలీసు అకాడమీలో జరిగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించటానికి బీపీఆర్‌ అండ్‌ డీ డైరెక్టర్‌ మీనా, ఏపీ జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్‌, రాష్ట్ర ఇంటలిజెన్స్‌ డీజీపీ శివధర్‌ రెడ్డి, సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad