– నిందితుల అరెస్ట్..
– ట్రాన్సిట్ వారెంట్ పద్ధతిన సూర్యాపేటకు తీసుకొచ్చిన పోలీసులు
– అర కిలో బంగారం సీజ్, రూ.92,500 నగదు రికవరీ
– పరారీలో మరికొందరు నిందితులు : ఎస్పీ నరసింహవివరాలు వెల్లడి
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట పట్టణంలోని జ్యువెల్లరీ షాపులో జరిగిన భారీ దొంగతనం కేసు ఛేదనలో పోలీసులు పురోగతి సాధించారు. నెలరోజుల నుంచి మిస్టరీగా మారిన ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన అరకిలో (554 గ్రాముల) బంగారు ఆభరణాలు, రూ.92,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. ఎంజీ రోడ్‌లో ఉన్న సాయి సంతోషి జ్యువెల్లరీ షాపులో జులై 21వ తేదీ ఆదివారం రాత్రి దుండగులు గ్యాస్ కట్టర్‌తో గోడకు కన్నం చేసి 2.5 కిలోల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సూర్యాపేట 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వెంటనే పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
జులై 27న సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఖమ్మం పట్టణానికి చెందిన మేకల యశోదను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 14 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె సహా మొత్తం ఏడుగురు ఈ దొంగతనంలో పాల్గొన్నారని తేలింది. అనంతరం బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో, నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల జాడను కనుగొన్నాయి. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దక్షిన్ దినాజ్‌పూర్ జిల్లా భైహౌర్ గ్రామానికి చెందిన మాలిక్ మొల్లను ఆగస్టు 11న అతని స్వగ్రామంలో అరెస్టు చేసి, 554 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.87,500 స్వాధీనం చేసుకున్నారు. బలుర్‌ఘట్ జిల్లా కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టి ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి పొంది, ట్రాన్సిట్ వారెంట్ ప్రకారం సూర్యాపేటకు తరలించారు. ఇదే కేసులో అమర్‌భట్‌ను ఖమ్మంలో అదుపులోకి తీసుకుని రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు. అమర్‌భట్ నిందితులకు ఖమ్మంలో ఆశ్రయం కల్పించడం, సూర్యాపేటలో రేకీ చేయడంలో సహకరించినట్టు విచారణలో వెల్లడైంది. సీసీ ఫుటేజ్, మొబైల్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. ఈ దొంగతనం నేపాల్‌కు చెందిన ప్రకాశ్ అనిల్‌కుమార్, కడాక్ సింగ్ అలియాస్ కడాక్ ఆహులిహలియ, పురన్ ప్రసాద్ జోషి, వెస్ట్ బెంగాల్ మల్దా జిల్లాకు చెందిన జషిముద్దీన్, అలాగే ఇప్పటికే అరెస్టైన మాలిక్ మొల్ల, అమర్‌భట్, మేకల యశోద కలిసి చేసినట్టు తేలింది. ముందస్తుగా దుకాణం వెనుక భాగంలో రేకీ చేసి, గ్యాస్ కట్టర్‌తో టీ బాత్‌రూమ్ గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి బంగారం, నగదు అపహరించినట్టు విచారణలో బయటపడింది.
అనంతరం కిరాయికి తీసుకున్న ఇంటికి వెళ్లి దొంగిలించిన సొత్తును ఐదు భాగాలుగా పంచుకుని, ఖర్చుల నిమిత్తం యశోదకు, అమర్‌భట్‌కు కొంత బంగారం, నగదు ఇచ్చినట్ట్టు మాలిక్ మొల్ల ఒప్పుకున్నాడు. వారందరినీ శనివారం సూర్యాపేట కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు. పరారీలో ఉన్న ప్రకాష్ అనిల్ కుమార్, కడక్ సింగ్, పురన్ ప్రసాద్ జోషి, జషిముద్దీన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు పర్యవేక్షణలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, సీసీఎస్ హరికృష్ణ, పెనపహాడ్ ఎస్‌ఐ గోపికృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు కర్ణాకర్, కృష్ణ, శ్రీనివాస్, సిబ్బంది పాలకీడు సైదులు, ఆనంద్, మల్లేష్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్ తదితరులు కృషి చేశారు. నిష్పక్షపాత దర్యాప్తుతో కేసులో కీలక పురోగతి సాధించిన బృందాలకు ఎస్పీ నరసింహ రివార్డు ప్రకటించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్‌ఐ గోపికృష్ణ ఉన్నారు.
గోల్డ్ షాప్‌లో చోరీ కేసులో పురోగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES