నవతెలంగాణ – అశ్వారావుపేట
విశాఖ పట్టణం నుండి అశ్వారావుపేట మీదుగా నాగపూర్ కు తరలిస్తున్న రూ.1 కోటి 11 లక్షల విలువైన 222 కిలోల నిషేధిత గంజాయిని శనివారం టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు.
సీఐ నాగరాజు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటల సమయంలో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలక్ష్మి తులసి ఆగ్రో పేపర్ మిల్స్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం వైపు నుండి అతివేగంగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ (ఏపీ 08 బీవీ 5868) కారును అడ్డగించి తనిఖీ చేయగా, అందులో 111 ప్యాకెట్లలో నింపిన 222 కిలోల గంజాయి లభించింది.
దీనిపై విచారణలో హైదరాబాద్ కు చెందిన ఏ1 ఉంగరాల సరీన్ కుమార్ (రవాణాదారుడు), బెల్లంపల్లి కి చెందిన ఏ2 బాబర్ ఖాన్ (కారు యజమాని)లను అదుపులోకి తీసుకున్నారు. వారు విశాఖకు చెందిన ఏ3 పంగి శ్రీను వద్ద రూ.4 లక్షలకు గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన ఏ6 ఇంతియాజ్ కు అధిక ధరకు విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు.
వాహన తనిఖీలను తప్పించుకునేందుకు హైదరాబాద్ కు చెందిన ఏ4 ఎండీ ఫీరోజ్, ఏ5 సంతోష్ లను పైలట్ వాహనాలు గా వినియోగించి నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా ముఠాను పట్టుకున్న అశ్వారావుపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు.
స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.4 వేలు నగదు, జియో రూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నార్కోటిక్ యాక్ట్ కింద 250/2025 కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు. అరెస్టయిన సరీన్ కుమార్ పై గతంలో రెండు నార్కోటిక్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. సోదాల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, అశ్వారావుపేట అదనపు ఎస్సై రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
