Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'రవాణా'లో ప్రమోషన్లు లేవ్‌!

‘రవాణా’లో ప్రమోషన్లు లేవ్‌!

- Advertisement -

ఇన్‌చార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్న వైనం
కొత్త కమిషనర్‌ అయినా తేల్చేనా?
పెండింగ్‌లో ఆర్టీవోలు, ఇతర ప్రమోషన్లు
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్‌ పెంపు నోటిఫికేషన్‌పై చర్యలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణా శాఖలో ప్రమోషన్లు ఆగిపోయాయి. ఇన్‌చార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏ పనులూ ముందుకు సాగడం లేదు. అడ్మినిస్ట్రేషన్‌ అస్తవ్యస్తంగా తయారైంది. కొత్తగా వచ్చిన కమిషనర్‌ అయినా ఈ సమస్యలపై దృష్టి పెడితే పరిష్కారం అవుతాయని సిబ్బంది అంటున్నారు. లేకపోతే ప్రజల సమస్యలు తీర్చలేకపోతున్నామని అంటున్నారు. ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలతో పాటు.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం కొత్త కమిషనర్‌పై పడింది. పెండింగ్‌లో ఉన్న ఆర్టీవో ప్రమోషన్లు, వాహన్‌ సారథితో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులు, హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌, చెక్‌పోస్టుల ఎత్తివేతతో పాటు ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్‌ విలువ పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌పై తుది నిర్ణయం వంటివి కమిషనర్‌ తక్షణమే దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

ముందుకు సాగని ఆర్టీవో ప్రమోషన్లు
కొంతకాలంగా రవాణాశాఖలో ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి మౌనమే సమాధానంగా మారింది. సంబంధిత అధికారులు ఎటు తేల్చకపోవడంతో ఇన్‌చార్జీలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా అర్హులైనవారు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఇద్దరు డీటీసీలను జేటీసీలుగా, ఐదుగురు ఆర్టీవోలను డీటీసీలుగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. అప్పటి నుంచి ఖాళీలతోపాటు రిటైర్‌ అయిన వారి స్థానంలో ప్రమోషన్‌కు అర్హత ఉన్నవారిని భర్తీ చేయడం లేదు. ఇందులో సికింద్రాబాద్‌, బండ్లగూడ, ఉప్పల్‌, నాగోల్‌, కామారెడ్డి, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం ఆర్టీవో పోస్టులు ఖాళీగా ఉండగా..ఇన్‌చార్జిలతో నెట్టుకోస్తున్నారు. దీంతో ఆర్టీవో పరిధిలో చేయాల్సిన పనుల్లో కొంత జాప్యం జరిగి.. వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కావునా అర్హులైన ఇన్‌స్పెక్టర్లు, ఇతర మినిస్ట్రీయల్‌ సిబ్బందికి ప్రమోషన్లు కల్పించడంతో పాటు జిల్లాల సంఖ్య పెరిగినప్పటికీ వాటిల్లో ఎంవీఐలే ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రాల్లో సీనియర్‌ ఎంవీఐలను అప్‌గ్రేడ్‌ చేసి ఆర్టీవోలుగా ప్రమోషన్‌ ఇస్తే.. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారమూ పడకపోవగా.. ప్రజలకు సులభతరంగా సేవలు అందనున్నాయి.

వాహన్‌ సారథి సమస్యలు తీరేనా..?
వినియోగదారులకు పారదర్శకమైన, మెరుగైన సేవలు అందించేందుకుగాను రాష్ట్ర రవాణాశాఖ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సారథి’ పోర్టల్‌ను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాహన సారథి అమలులోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వాహనదారులు నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్లాట్‌ బుకింగ్‌ సమయంలో ముప్పు తిప్పలు పడుతున్నారు. లెర్నింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి సేవలు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక్కో స్లాట్‌కు గంటల సమయం పడుతోంది. దీనికితోడు స్లాట్‌ బుకింగ్‌ సమయాన్ని బట్టి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో వాహనదారుల నుంచి పెద్దసంఖ్యలో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిసింది. గతంలో ఉన్న సిటీజన్‌ ఫ్రెండ్లీ సర్వీసెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌(సీఎఫ్‌ఎస్‌టీ) విధానంలో పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉండేదని, కొత్త పోర్టల్‌లో ఆ వెసులుబాటు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు పేర్కొంటున్నారు. అలాగే, నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడం సమస్యగా మారింది.

ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్‌ పెంపు
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్‌ ఫీజులను భారీగా పెంచుతూ రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. అత్యంత ఆదరణ ఉన్న ‘9999’ నెంబర్‌ కనీస వేలం ధరను రూ. 50వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచనున్నారు. ‘6666’ నెంబర్‌కు రూ.30వేల నుంచి రూ.70వేలకు పెంచే ప్రతిపాదన ఉంది. ఈ ఫీజుల పెంపు ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.100 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.

హైసెక్యూరిటీ నంబర్ల ప్లేట్లా..
హైసెక్యూరిటీ నంబర్ల ప్లేట్ల విషయంలో వాహనదారులు సెప్టెంబర్‌ 30వ తేదీ అఖరు తేదీగా భావించి చాలామంది నకిలీ వెబ్‌సైట్ల్‌ ద్వారా డబ్బులు చెల్లించి నష్టపోయారు. అనంతరం రవాణాశాఖ స్పందించి పాత వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్పీ నెంబర్‌ ప్లేట్‌ బిగించేందుకు ఎటువంటి గడువు విధించలేదని ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ దీనిపై ప్రజల్లో ఒక గందరగోళం నెలకొంది. కేంద్రం 15 నుంచి 20 ఏండ్లు నిండిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ పెంచుతూ నోటిఫికేషన్‌ను రాష్ట్రంలో అమలు చేస్తారా? లేదా? స్పష్టత రావాల్సి ఉంది. చెక్‌ పోస్టులు ఎత్తివేత, ఆయా చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్లు సిబ్బందిని సర్దుబాటు, మొబైల్‌ చెకింగ్‌పై వంటి వాటిపై స్పష్టత రావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -