Tuesday, February 24, 2026
E-PAPER
Homeమానవిపరీక్షల‌వేళ స‌రైన ఆహారం

పరీక్షల‌వేళ స‌రైన ఆహారం

- Advertisement -

పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకు కూడా టెన్షన్‌ మొదలువుతుంది. ఎందుకంటే వాళ్లు ఏడాదంతా చదవడం ఓ భాగమైతే ఎగ్జామ్స్‌ టైంలో చదవడం మరో భాగం. మరీ ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం, చదువు విషయంలో తల్లులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సాధారణంగా పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే సమయంలో పుస్తకాలతో కుస్తీ పడుతూ పిల్లలు తిండిపై అంతగా ఆసక్తి చూపించరు. టైంకి తినకపోవడం, అంతగా ఆకలేస్తే ఏదో ఒకటి తినేయడం వల్ల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకొనే అవకాశం ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. అందువల్ల, ఇలాంటి సమయంలో ఆహారం విషయంలో అస్సలు అజాగ్రత్త పనికిరాదని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి తగ్గించే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. పది, ఇంటర్‌ పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం!

ఆరోగ్యకరమైన ఆహారం తమ జీవనశైలిలో భాగంగా ఉన్నవాళ్లు పరీక్షల కోసం ప్రత్యేకంగా తినాల్సిన అవసరం లేదు. కానీ సరైన పోషకాహారం తీసుకొని వాళ్లు పరీక్షల్లోనైనా కొంత మేరకు ఆహార అలవాట్లు మార్చుకుంటే మేలు. పోషకాహారమే ఆరోగ్యం, ఆనందం.. ఈ రెండూ ఉంటేనే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే కెరియర్‌లోనూ రాణిస్తారు

పోషకాలూ అందేలా…
చదవడం కెలరీలు ఖర్చయ్యే పనేం కాదు. కానీ అలసటతో కూడుకున్నదంటున్నారు నిపుణులు. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటుండాలని చెబుతున్నారు. పరీక్షల హడావుడిలో పడి.. రోజుల పాటు కూర్చొనే ఉంటే బరువులో తేడాలొస్తాయి. అందువల్ల మితంగా, అన్ని పోషకాలూ అందేలా ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. మెదడు, న్యూరో ట్రాన్స్‌మీటర్లకు ఈ సమయంలో మేలైన మాంసకృతులు కావాలి. పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా గింజలు, నూనె గింజల్లో ఇవి లభిస్తాయి. పెసరట్టు, మినపట్టు, కుడుము, గుప్పెడు ఉడకబెట్టిన పల్లీలు, గుగ్గిళ్లు, అలసందలు తీసుకోవచ్చు.

అన్నం తగ్గించి…
మాంసాహారులు తక్కువ నూనెతో చేసిన గుడ్డు, ఆమ్లెట్‌, చికెన్‌, చేపలు రోజూ తినొచ్చు. ఈ టైంలో అన్నం తగ్గించాలని, లేదంటే నిద్ర వచ్చేస్తుంది. తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అన్నాన్ని ఒకపూటకు పరిమితం చేసుకొని, మిగతా వేళల్లో పొట్టుతో ఉన్న జొన్న, సజ్జ, గోధుమ రొట్టెలు లేదా దంపుడు బియ్యం వంటివి తీసుకుంటే బి కాంప్లెక్స్‌ కొరత ఉండదు. అలాగే ఆకు, కాయగూరలకు ప్రత్యామ్నాయం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచడానికి అరటిపండు, ఆపిల్‌, నారింజ, బొప్పాయి, జామ లేదా పుచ్చకాయ వంటి కాలానుగుణ పండ్లు ఇవ్వాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒత్తిడిని తట్టుకొనేందుకు
విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే నువ్వులు, అవిసె లడ్డూ, నట్స్‌, మరమరాలు, జొన్న పేలాలు, వేయించిన పుట్నాలు, బఠానీలు వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు సాయపడతాయి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులైతే.. టమాటా, కీరా, క్యారెట్‌తో పాటు మునగాకు, కరివేపాకు, గోంగూర, పుదీనా పొడులు తింటే మంచిది. రోజూ 300 ఎంఎల్‌ పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే గ్లూకోమిక్స్‌, క్యాల్షియం తగినంత లభిస్తుంది. అలాగే మంచి నీరు పక్కనే ఉంచుకోవాలి. వేడి వల్ల శరీరం లవణాలు కోల్పోయి నీరసం, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రాల్‌ లేదా నిమ్మకాయ నీటిని రోజులో రెండు సార్లు తాగాలి. చక్కెర వేసిన జ్యూస్‌లకు దూరంగా ఉంటే చాలా మంచిది. వీటికి బదులుగా నేరుగా పండ్లు తింటే మేలు. ఎక్కువ నూనెలు ఉండే పూరీ, వడ, పులిహోర, బిర్యానీ లాంటి వంటి జోలికి పోవద్దు. వీటికి బదులుగా పెరుగన్నం, కూరగాయ కర్రీ, ఆకుకూర పప్పు బ్యాలెన్స్‌గా ఉంటుందని చెబుతున్నారు. సాయంత్రం వేళ బ్రెడ్‌, గ్లాసు పాలు, అరటిపండు, జామ్‌ లేదా తేనెతో చపాతీ, చట్నీ, పొడులతో ఇడ్లీ తీసుకుంటే మంచిది.

బ్రెయిన్‌ ఫంక్షన్‌కి…
మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌లో లేదా స్నాక్స్‌ టైంలో ఎగ్స్‌ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో విటమిన్‌ సి తప్ప అన్ని రకాల న్యూట్రిషన్స్‌ ఉంటాయి. ఇలాంటి న్యూట్రిషన్స్‌ లభించినప్పుడు హెల్తీగా ఉండటంతోపాటు బ్రెయిన్‌ ఫంక్షన్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ బీన్స్‌, బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి ఇవ్వాలి. పరీక్షలు ఉన్నన్ని రోజులు కాసిని ఉసిరి క్యాండీలనో, ఉప్పులో వేసిన ముక్కలనో దగ్గర పెట్టుకోమంటున్నారు నిపుణులు. ఇవి పిల్లలకు అప్పుడప్పుడు ఇస్తే మంచిదంటున్నారు. ఇవి మెదడుకి ఆక్సిజన్‌ పుష్కలంగా అందేట్టు చేసి పిల్లల్ని చురుగ్గా ఉంచుతాయి. హుషారుగా పరీక్షలు రాసేందుకు సహకరిస్తాయి. అలాగే పరీక్ష సమయంలో చక్కెర ఉన్న చాక్లెట్‌లు, తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్‌ బిళ్లలు దగ్గర పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -