Friday, May 9, 2025
Homeమానవిమ‌హిళ‌ల ప్ర‌తిభ‌కు స‌రైన గుర్తింపు

మ‌హిళ‌ల ప్ర‌తిభ‌కు స‌రైన గుర్తింపు

- Advertisement -

అమృతలత-అపురూప అవార్డ్స్‌… వీటిని అందుకునే అవార్డు గ్రహీతలే కాదు మరెంతో మంది ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏడాది వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పురస్కారాలకు అంతటి ప్రాధాన్యం వుంది. ప్రతి ఏడాది మాతృదినోత్సవం నాడు డాక్టర్‌ అమృతలత ఈ అవార్డులను ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళా మణులను గుర్తించి స్వయంగా పిలిచి మరీ సత్కరిస్తున్నారు. ఆ అపురూప ఘట్టం మరో రెండు రోజుల్లో జరగబోతున్న సందర్భంగా ఈ అవార్డుల వ్యవస్థాపకురాలైన అమృతలత ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
అమృతలత – అపురూప అవార్డ్స్‌ ఇవ్వాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది?
మన మధ్య ఎందరో కళాకారులు, క్రీడాకారులు వుంటారు. మనం సాధారణంగా పదుల సంఖ్యలో వున్న వారినే గుర్తించుకుంటాం గానీ, వందల సంఖ్యలో వున్న వారిని అంతగా పట్టించుకోము. సినీ యాక్టర్స్‌ని, క్రికెట్‌ ప్లేయర్స్‌ని తప్ప జనం దృష్టి ఇతర కళల మీద, వారి అఛీవ్మెంట్స్‌ మీద అంతగా వుండదు. అందుకే ఈ అవార్డ్స్‌ పేర సినీ రంగంలో వున్న కళాకారులతో పాటు ఇతర రంగాలలో వున్న కళాకారులను కూడా సన్మానిస్తే బావుంటుందని అనిపించింది. ముఖ్యంగా ఈ అవార్డ్స్‌ తీసుకునే సమయంలో అవార్డు గ్రహీతల ముఖాల్లోని ఆనందాన్ని చూసినపుడు నాకెంతో ముచ్చటేస్తుంది. ఆ క్షణాల్లో ఎందుకో నేను పిల్లల సంతోషాన్ని ఎంతో మురిపెంగా వీక్షించే అమ్మనై పోతుంటాను.
అమృతలత అవార్డ్స్‌కి అప్లికేషన్‌ పెట్టుకోవాలా, ప్రాసెస్‌ ఏమిటీ?
అవార్డుల కోసం ప్రత్యేకించి ఎవరూ ఎవరికీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని వెతుక్కుంటూ వచ్చి, వారి ఇంటి తలుపులు తట్టడమే ‘అమృతలత – అపురూప అవార్డ్స్‌’ ప్రత్యేకత.
మరి అవార్డ్స్‌ ఎంపిక ప్రక్రియ?
వివిధ రంగాల్లో ప్రతిభని చూపిన మహిళల శక్తి సామర్థ్యాలను పసిగట్టి, వారి పేర్లతో ఎప్పటికప్పుడు ఓ పట్టిక తయారు చేసుకుంటాం. నిజానికి ఆ పట్టికలో ఇప్పటికే ఎంతో మంది నిష్ణాతుల పేర్లు వున్నాయి. అందరికీ ఒకేసారి అవార్డ్స్‌ ఇవ్వలేం కాబట్టి ఆయా రంగాల్లో వారి సీనియారిటీనీ, అందులో వారు చేసిన కృషినీ, న్యాయనిర్ణేతల అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. ‘ఈసారి ఈ అవార్డుకి మీరు ఎంపికయ్యారు..’ అని సదరు వ్యక్తులకు మా అవార్డు కమిటీ వ్యక్తుల నుండి మెసేజ్‌ రిసీవ్‌ చేసుకున్నపుడు అవార్డు గ్రహీతలు ఎంతో ఆశ్చర్యానందాలకు గురవడం చూస్తుంటాం.
ఫలానా వ్యక్తులకు అవార్డు ఇవ్వమంటూ మీకు ఎవరి నుండైనా రికమండేషన్స్‌ వస్తుంటాయా?
సూచనలు వస్తుంటాయి. రావాలి కూడా! వచ్చినవన్నీ లిస్ట్‌లో పెట్టుకుంటాం. ఎక్కడెక్కడో వున్న ప్రతిభావంతులను కనిపెట్టేందుకు మన కళ్ళు సూర్య కిరణాల్లా చొచ్చుకొని పోలేవు కదా.. మనం అవార్డులివ్వని వాళ్ళల్లో కూడా మన దృష్టికి రాని ప్రతిభావంతులెందరో వుంటారు. వాళ్ళకీ ఛాన్స్‌ రావొచ్చు!
ఈ అవార్డ్స్‌ విషయంలో మీకు ఎవరెవరు సహకరిస్తున్నారు?
అపురూప అవార్డ్స్‌ అన్నీ మా బంధు మిత్రులే ఇస్తున్నారు. వాళ్ళందరూ అది వారి ఇంటి పెళ్లిలా భావించి, తలో బాధ్యత తీసుకుంటారు. ఓసారి ప్రముఖ రచయిత్రి జలంధర గారు ప్రతి ఏటా వాళ్ళ నాన్న గారు ప్రముఖ రచయిత, వైద్యులు డా.గాలి బాల సుందరరావు గారిపేర ‘నాటక రంగం’ సంబంధించిన వారికి అపురూప అవార్డు ఇస్తామని చెప్పారు. క్రమం తప్పకుండా ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామిక వేత్త దయానంద్‌ రెడ్డి గారి సతీమణి రేణుక గారు కూడా ముందుకొచ్చి తనూ ఓ అవార్డుని స్పాన్సర్‌ చేస్తానని చెప్పడం ఎంతో సంతోషం కలిగించింది. వివిధ సంస్థల్లో పనిచేస్తోన్న మూడు వందల మంది మా ఉద్యోగుల్లో ఓ పది మంది ఆ రోజు స్వచ్చందంగా విచ్చేసి అటు హై టీ, రిఫ్రెష్‌ మెంట్‌ వ్యవహారాలు, ఇటు సభా కార్యక్రమాలకు సంబంధించిన పాటలు, మెమెంటోలు, సీటింగ్‌ ఆరెంజిమెంట్‌ వంటి విషయాల్లో సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తుంటారు. అవార్డ్స్‌ రోజు సభా నిర్వహణ అంతా నెల్లుట్ల రమాదేవి కనుసన్నల్లో ఎంతో ఆహ్లాద భరితంగా జరుగుతుంది. అవార్డు గ్రహీతల పరిచయాలతో కూడిన ‘అభినందన’ సావనీర్‌కి నేను, కిరణ్‌ బాల, నెల్లుట్ల రమాదేవి సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తుంటాం. అవార్డు గ్రహీతల ఎంపిక, వారి వివరాలతో కూడిన సావనీర్‌కి సంబంధించిన డీటీపీ వర్క్‌ అంతా మదన్‌, కృష్ణపతి చేస్తుంటారు. సావనీర్‌ ప్రచురణ నిజానికి ఎంతో క్లిష్ట తరమైన వ్యవహారమైనప్పటికినీ, అవార్డు గ్రహీతలు ఆ పుస్తకాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎంతో మురిపెంగా చూస్తున్న సమయంలో.. వారి కళ్ళల్లో కనిపించే మెరుపులు చూసిన పుడు.. నెల రోజులపాటు మేము పడ్డ శ్రమని ఇట్టే మరిచిపోతుంటాం. ‘ఏ సన్మానాల్లోనైనా అవార్డు గ్రహీతలకు శాలువాలు, బొకేలూ, మెమెంటోలూ, నగదు ఇవ్వడం సహజం, కానీ ఆ నాలుగింటితో పాటు సావనీర్‌ని కూడా ఇవ్వడం, మధ్య మధ్య.. ఆటలూ, పాటలూ, సర్ప్రైజ్‌ గిఫ్ట్స్‌ పేర జనరంజకంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం కేవలం మీ అమృతలత అపురూప అవార్డ్స్‌ లోనే చూస్తుంటాం’ అంటారు చాలామంది. ఆ తృప్తి చాలు కదా నిర్వాహకులకు.
మీరు కేవలం మహిళలకు మాత్రమే అవార్డ్స్‌ ఇస్తున్నారు. పురుషుల పట్ల మీరు వివక్ష చూపుతున్నారనే అభిప్రా యం కూడా అక్కడక్కడా వినిపిస్తుంది. దీనికి మీ సమాధానం..?
ఇంటి పనులతో, బయట పనులతో ఎంతో అలసిపోతారు మహిళలు. తమ టాలెంట్‌ని ప్రదర్శించే అవకాశం, సమయం కూడా వారికి మగవారిలా కలిసిరాదు. అందుకే వారి టాలెంట్‌కి సరైన గుర్తింపు లభించే ఇలాంటి అవార్డ్స్‌ ఇవ్వడం ద్వారా మహిళలలో చిగురంత ఉత్సాహం కలిగినా కొండంత సంతోషించే స్వభావం మా అవార్డు ప్రదాతలది. అందుకే అవార్డ్స్‌లో సింహ భాగం మహిళలకే ఇవ్వడం జరుగు తోంది. అయినప్పటికీ ప్రతి రెండేళ్లకోసారి ఆంధ్రా, తెలంగాణ, రాయల సీమ మూడు ప్రాంతాలకు చెందిన ఆరుగురు పురుషులకు కూడా అమృతలత అవార్డ్స్‌ ఇస్తున్నాం. అదీగాక గత పన్నెండేళ్లుగా నా జన్మ స్థలమైన నిజామాబాదు జిల్లాకి చెందిన వివిధ రంగాలలో పేరు తెచ్చుకున్న పది మందిని ప్రతి రెండేళ్లకోసారి ‘ఇందూరు అపురూప అవార్డ్స్‌’ పేర సన్మానించాం. అందులో ‘సగ భాగం’ పురుషులకే ఇచ్చాం! మొదట్లో నాకు మగవారి పట్ల ఎలాంటి వివక్ష లేదనీ ముఖ్యంగా కుల, మత, జాతి, ప్రాంత భేదాలు అసల్లేవని చెప్పడానికి ఈ వివరాలు చాలనుకుంటాను.

చక్కటి అనుభూతి
డాక్టర్‌ అమృతలతగారితో నా పరిచయానికి నలభైయేళ్లు, అనుబంధానికి ముప్ఫైయేళ్లు. ఒక విద్యావేత్తగా పరిచయమైన ఆమె ఒక పత్రికా సంపాదకురాలిగా నాకు సన్నిహితులయ్యారు. ఒకప్పుడు తాను నడిపిన అమృత్‌కిరణ్‌ పక్షపత్రికకు నేను రచనలు పంపించేదాన్ని. ఎడిటర్‌గా నా రచనాశక్తిని గుర్తించి నన్ను ఆదరించారు. ఎదుటి వ్యక్తిలో ఏ చిన్న కళ వున్నా అది ఆమె సునిశిత దృష్టి నుండి తప్పించుకోలేదు. ఆ వ్యక్తిలోని కళను గుర్తించి, దానికి మెరుగులు దిద్దుకునేలా ఆ వ్యక్తికి ప్రోత్సాహాన్నీ, సహాయాన్నీ అందిస్తారు. తన నుండి నాకు అలాంటి చేయూతే లభించింది. నాలో రచనాశక్తి, ఎడిటింగ్‌ శక్తి వున్నాయని గుర్తించి నేడు నన్ను ఒక సహసంపాదకురాలిగా చేర్చుకున్నారు. ‘కళాపిపాసి’ అయిన ఆమె వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని ప్రతియేడూ ‘అమృతలత-అపురూప అవార్డు’లతో సత్కరిస్తున్నారు. ‘ఎంత మందికి ఎంత తొందరగా అవార్డులు ఇవ్వాలా!’ అని ఆమె ప్రతి యేడూ వువ్విళ్లూరుతుంటారు. కళాకారులు, సేవామూర్తుల పట్ల అంతటి గౌరవం ఆమెకు. అవార్డు గ్రహీతల పరిచయాలతో ప్రతి ఏడాది విడుదలయ్యే ‘అభినందన’ సంచికకు సంపాదక వర్గంలో నాకూ స్థానం కల్పించారు డా|| అమృతలతగారు. ఈ సంచిక విడుదల కన్నుల పండుగగా వుంటుంది. ఉత్సాహంగా, స్నేహపూరిత వాతావరణంలో అమృతలత, నెల్లుట్ల రమాదేవిలతో కలిసి పని చేయడం ఒక రిలాక్సేషన్‌, ఆనందం అయితే, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నావంతు బాధ్యతని నిర్వర్తించటం చక్కటి అనుభూతినిస్తుంది.
– కిరణ్‌బాల

ఎంతో తృప్తిని పొందుతున్నాను
మహిళలు ఇంటి పనులు, పిల్లల పెంపకం, వృత్తి ఉద్యోగాలు చూసుకుంటూ కూడా తమలోని కళను నిలబెట్టుకోవడం చాలా కష్టమనీ, ఈ విషయంలో మగవారికున్న వెసులుబాటు స్త్రీలకు లేదనీ, గుర్తింపు విషయంలో కూడా మహిళలకు అన్యాయం జరుగుతోందని అమృత గారి దృఢ అభిప్రాయం. అందుకని రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలకు.. వారి కృషిని గుర్తించి నగదుతో కూడిన పురస్కారాలను అందజేయాలనీ, అందులో సింహభాగం సాహిత్యానికి చెందాలనీ, ముఖ్యంగా సగభాగమైన తెలంగాణా మహిళలకు ఉండాలనీ ఆమె సంకల్పించారు. దీని నిర్వహణలో నన్ను భాగస్వామిగా చేయడం కేవలం నా భాగ్యం మాత్రమే. నాతోబాటు ప్రముఖ కవయిత్రి, రచయిత్రి కిరణ్‌ బాల కూడా ఇప్పటివరకు గురుతర బాధ్యతను వహిస్తున్నారు. రచయిత్రి తుర్లపాటి లక్ష్మి కూడా కొన్నాళ్ళు తమ సేవలందించారు. ప్రముఖ కవి ఎనిశెట్టి శంకర్‌ గారు మాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఏదో ఒక గుర్తుండే రోజున చేయాలనే ఉద్దేశంతోనూ, ఎక్కువ మందికి సెలవులుంటాయనీ మే నెల రెండవ ఆదివారం మదర్స్‌ డే రోజున ఈ సభ జరుపుతున్నాం. ఇంత గొప్ప కార్యక్రమంలో ఓ కార్యకర్తగా నేనెంతో తృప్తిని పొందుతున్నాను. ఈ పరంపరలో నేను చిన్నప్పటినుంచీ ఎవరిని చూస్తూ స్ఫూర్తి పొందానో అలాంటి ఎందరో గొప్పవాళ్లను కలవడం, వారున్న వేదికపై వ్యాఖ్యాతగా, ‘అభినందన’కు సహ సంపాదకురాలిగా ఉండటం నాకు అమృతలత గారి వల్ల లభించిన అవకాశం. ఇదంతా ఆమెకు కళల పట్ల, రచయితల పట్ల ఉన్న గౌరవం వల్లనే. ఈ అవార్డుల పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతున్నాను.
నెల్లుట్ల రమాదేవి, అవార్డ్స్‌ కమిటీ సభ్యులు

ఏయే రంగాల వారికి మీరు ఈ అవార్డ్స్‌ ఇస్తుంటారు?
కథ, కవిత్వం, నవల, వ్యాసం, అనువాదం, నాటిక, నాటకం, సంపాదకత్వం, ఆత్మకథ లాంటి సాహితీ ప్రక్రియలతో పాటు సంగీతం, నాట్యం, సాంస్కృతిక, వైద్య, విద్య, క్రీడా, యోగా, సామాజిక సేవ, పారిశ్రామిక, వ్యవసాయం, మీడియా, సినిమా లాంటి ఎన్నో ఇతర రంగాల వారికి ఇస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -