Friday, November 28, 2025
E-PAPER
Homeజాతీయంఇక సులభంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ !

ఇక సులభంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ !

- Advertisement -

పంజాబ్‌లో ఈజీ రిజిస్ట్రీని ప్రారంభించిన సీఎం మాన్‌

చండీఘడ్‌ : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో వుండేలా ‘ఈజీ రిజిస్ట్రీ’ని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ గురువారం ప్రారంభించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారంగా, సమయం ఎక్కువ తీసుకునే ప్రక్రియగా దశాబ్దాల కాలంగా వుంటూ వచ్చిందని, తరచుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్ళాల్సి రావడం, పనులు అవక జాప్యం ఎదుర్కొనడం పైగా అవినీతి సమస్య వీటన్నింటితో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ఆస్తి ఎక్కడుందో ఆ ప్రాంతానికి చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందని, ఇది వారికి భారంగా, అసౌకర్యంగా వుంటూ వచ్చిందన్నారు. అయితే, వ్యయ ప్రయాసలతో కూడిన ఈ ప్రక్రియ అంతా ఇక గతానికి చెందిన వ్యవహారం కాబోతున్నదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

పంజాబ్‌ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చిన ఈజీ రిజిస్ట్రీతో సులభతరం, వేగం, పారదర్శకత కలిగిన కొత్త తరంలోకి ప్రవేశించామని చెప్పారు. రూ.500 నామినల్‌ ఫీజు చెల్లించి సేవా కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్‌ ద్వారా ముసాయిదా సేల్‌ డీడ్‌లను పొందవచ్చన్నారు. ‘సర్కార్‌ తుహడె ద్వార్‌’ పథకంలో భాగంగా ఫోన్‌ ద్వారా కూడా ఈ సేవలు అందుకోవచ్చు, కేవలం 48గంటల్లో ఆన్‌లైన్‌ డాక్యుమెంట్ల ప్రక్రియ పూర్తయిపోతుందన్నారు. ‘డ్రాఫ్ట్‌ మై డీడ్‌’ ఫీచర్‌ ద్వారా ఎవరైనా సేవా కేంద్రాలు లేదా సేవా అసిస్టెంట్ల సాయంతో తమ సొంతంగా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. పదే పదే బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగకుండా ప్రజలు తమ రిజిస్ట్రేషన్‌ పత్రాలు పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిందంటే వాట్సాప్‌ ద్వారా వారికి ధృవీకరణ సమాచారం అందుతుంది. ఒకసారి వెళ్లి తమ డాక్యుమెంట్లు తెచ్చుకోవడమేనని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -