కేంద్రానికి ప్రపంచ ఆర్థికవేత్తల వినతి
న్యూఢిల్లీ : స్వతంత్ర, విశ్వసనీయ, భిన్న అభిప్రాయాలకు వేదిక అయిన మీడియాకు రక్షణ కల్పించాలని వివిధ దేశాలకు చెందిన 11 మంది ప్రముఖ ఆర్థికవేత్తలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ తరహా జర్నలిజంలో పెట్టుబడి పెట్టి దానిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ మేరకు నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ ఈ. స్టిగ్లిట్జ్, డారన్ అసెమొగ్లు సహా ప్రముఖ ఆర్థికవేత్తలు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే మీడియా నాణ్యమైన సమాచారాన్ని అందిస్తుందని వారు తెలిపారు. అలాంటి మీడియా సంస్థలు సమాచార ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బ్యాంకుల వంటివని వివరించారు. అవి వ్యవస్థలో విశ్వాసాన్ని నెలకొల్పుతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న మీడియాపై ప్రపంచవ్యాప్తంగా బెదిరింపులు పెరుగుతున్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మంచి సమాచారాన్ని మార్కెట్ శక్తులు ఎప్పటికీ అందజేయవని, ప్రస్తుత డిజిటల్ శకంలో వ్యాపార ప్రకటనల ద్వారా స్వతంత్ర మీడియాకు ఆదాయం కూడా సమకూరడం లేదని వారు తెలియజేశారు. ప్రభుత్వ జోక్యం పెరగడం కూడా స్వతంత్ర మీడియాకు అశనిపాతంగా మారిందని వాపోయారు. ప్రపంచ వ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో పత్రికా స్వేచ్ఛ క్షీణించిందని చెప్పారు. మీడియాపై ఆంక్షలతో కూడిన చట్టాలు, పరువు నష్టం దావాలు, అణచివేతలు వంటి వ్యూహాత్మక దాడులు పెరిగిపోతున్నాయని వారు వివరించారు.