పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
వచ్చే నెల 9వరకు కొనసాగనున్న శిబిరాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పాడిపశువుల్లో గాలికుంటు వ్యాధిని నిర్మూలించేందుకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు వైద్యశిబిరాలు నిర్వహించి టీకాలు వేస్తున్నారు. అనంతరం పశువైద్య సిబ్బంది పశువుల్లో గాలికుంటు వ్యాధితో కలిగే నష్టాలు, టీకాతో కలిగే లాభాలపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ టీకా కార్యక్రమం మార్చి 10న ప్రారంభం కాగా ఏప్రిల్ 9 వరకు సాగుతుందని మండల పశు వైద్యాధికారి అభిలాస్ తెలిపారు. మండలంలో మొత్తం పశువులు 10,047 ఉండగా తెల్లజాతి ఆవులు,ఎద్దులు,గెదలు 2,784,నల్లజాతి మేకలు,గొర్రెలు 7,263 ఉన్నాయి.ఇప్పటి వరకు టీకా వేసిన 794 పశువులకు వేశారు.
ఆరు నెలలకోసారి టీకా..
జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం (ఎన్ ఏడీసీపీ) కింద దేశంలోని పశువులకు ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పశువులకు ఆరు నెలల కోసారి టీకాలు వేయిస్తే వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు.నాలుగు నెలల వయసు పైబడిన పశువులకు ఈ టీకా వేయించడం అవసరమని సూచించారు.పాడి రైతులు శిబిరం సద్వినియోగం చేసుకొని తమ పశువులు ఆవులు,గెదలు,ఎడ్లు,గొర్రెలకు గాలికుంటూ టీకా వేయించాలని అధికారులు సూచిస్తున్నారు.
పశువుల ఆరోగ్యం కోసమే: అభిలాస్..మండల పశు వైద్యాధికారి
పాడి రైతులు పశువుల ఆరోగ్యం కోసం గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిస రిగా వేయించాలి. గాలికుంటు సోకితే పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడం,ఆరోగ్యం దెబ్బతినడం వంటి లక్షణాలుంటాయి. ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.



