– అధిక దిగుబడుల కోసం అన్నదాతల మార్గాన్వేషణ
– పెరుగుతున్న పెట్టుబడులు
– వాతావరణ అసమతుల్యతతో నష్టాలు
– బోరుమంటున్న కౌలు రైతులు
– ప్రభుత్వం పట్టించుకోవాలని వినతి
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వాతావరణంలో వస్తున్న మార్పులు, తెగుళ్ల బెడద, మామిడి సాగులో కౌలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా తెగుళ్ల బెడద వల్ల పూతదశ మొదలుకొని దిగుబడి వరకూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కౌలు రైతులు నష్టాలబారిన పడుతున్నారు. సమస్యను అధిగమించేందుకు ఆధునిక పద్ధతుల ద్వారా దిగుబడి పెంచేందుకు రక్షణా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మామిడి సాగులో పూతదశలోని తోటలకు తెగుళ్ల నివారణా చర్యలు తప్పనిసరి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ కాయ పరిమాణం పెంచేందుకు జాగ్రత్తలు తప్పనిసరి. దీనితో పాటు వేసవిలో ఎదురయ్యే అధిక వర్షాలు, వడగండ్లు, ఈదురు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు మామిడికాయల చుట్టూ కవర్లను ఏర్పాటు చేస్తారు. ఖర్చుకు వెనుకాడకుండా తోటలను కాపాడుకునేందుకు ప్రయత్నింటారు. ఈ క్రమంలో పెట్టుబడి పెరిగి, పంట చేతికందే సమయానికి వాతావరణ ప్రభావం వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కవర్లను ఉచితంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని సంఘాల నాయకులు కోరుతున్నారు.
సాధారణంగా మామిడి పిందె దశలోనే ఎక్కువగా రాలిపోతుంటుంది. పురుగు ఆశించి లోపలి గుజ్జు తినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుంది. దీన్ని అధిగమించేందుకు పిందె దశలోనే రక్షణ కవర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి చూడటానికి బయట గోధుమ రంగు, లోపల నల్ల రంగులో ఉంటాయి. ఇవి అధిక వేడి నుంచి రక్షణగా నిలుస్తాయి. వడగండ్ల వాన పడినా కాయలపై ప్రభావం చూపదు. కవర్ తొడిగిన 65 నుంచి 75 రోజుల తర్వాత తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి మచ్చలు లేకుండా పసుపు రంగులో కాయలు నిగనిగలాడుతుంటాయి. మామిడి కాయలు పాకానికి వచ్చేందుకు హీట్ యూనిట్ 585 గంటలు అవసరం. ఈ కవర్ ద్వారా కాయ రంగుతో పాటు బరువు కూడా పెరుగుతుంది. సాధారణ మామిడి కాయలతో పోల్చితే వీటి ధర మార్కెట్‌లో కిలోకు రూ.80 నుంచి 100 పలుకుతున్నది. వీటిని జిల్లా నుంచి ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి.
రక్షణ కవర్ల ధర ప్రియం
ఏటా మామిడి తోటలకు పిందెలు ఉన్నప్పుడే కవర్లు ఏర్పాటు చేస్తారు. ఒక కవర్‌కు రూ.2.50, మామిడికాయకు కట్టినందుకు రూపాయి కలిపి మొత్తం రూ.3.50 ఖర్చవుతుంది. ఫిబ్రవరిలో కాయలకు కవర్లు కట్టి, మే మొదటి వారంలో కాయలను తెంపుతారు. కాయకు కవర్ కట్టడం వల్ల సాధారణం కంటే 150 గ్రాముల బరువు అధికంగా వస్తుంది. కవర్ తొడగని కాయ 50 నుంచి 60 టన్నులు దిగుబడి వస్తే, కవర్ తొడిగిన కాయలు 100 నుంచి 150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వేసవిలో వచ్చే వడగండ్ల వాన వల్ల కాయలు దెబ్బతినకుండా రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అధిక ఆదాయం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
కౌలు రైతులకు అధిక నష్టం
సాధారణంగా మామిడి తోటలను కౌలు రైతులే సాగు చేస్తుంటారు. రెండు నుంచి మూడేండ్లకు ఒకసారి కౌలు ఖరారు చేసుకుంటారు. ఒకవేళ మామిడి కాయలు రాకపోతే నష్టం కౌలు రైతులు భరించాల్సిందే. ప్రభుత్వ పరిహారం మాత్రం పట్టాదారులకు వస్తుంది. కాబట్టి కౌలు రైతులను దృష్టిలో పెట్టుకుని కవర్లను సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తే ఖర్చు తగ్గించుకునే అవకాశముంటుందని కౌలు రైతులు కోరుతున్నారు.
కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి : శ్రీనివాసులు,రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్ కర్నూల్
ఉమ్మడి జిల్లాలో మామిడిసాగులో అత్యధికంగా ఉన్నది కౌలు రైతులే. సాధారణంగా మామిడిలో ఒక ఏడాది దిగు బడి బాగావస్తే రెండో ఏడాది రాదు. అందుకే ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం నేరుగా కౌలు రైతులకు రావాలి. ముఖ్యంగా మామిడికాయ సైజులు పెంచడానికి ఉపయో గించే కవర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టాల నుంచి రైతులు గట్టేక్కడానికి అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.
బెనిషాన్ మామిడి రైతుల పరేషాన్
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 60 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలున్నాయి. ఇందులో 45 వేల ఎకరాలు బేనీషాన్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగినపల్లి మామిడికి ఉన్న ఆదరణ వల్ల ఎంత ఖర్చయినా సరే నాణ్యమైన దిగుబడి కోసం రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ ద్వారా పిచికారి చేసి తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మామిడి తోటలను సాగు చేసే రైతులపై దృష్టి సారించి ఆధునిక మామిడి సాగుపై అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.



