Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి దిగుమతులపై 11శాతం పన్ను రద్దుపై నిరసన

పత్తి దిగుమతులపై 11శాతం పన్ను రద్దుపై నిరసన

- Advertisement -

సెప్టెంబర్‌ 25నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు : రాష్ట్ర శిక్షణా తరగతుల్లో టి.సాగర్‌ పిలుపు

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న 11శాతం పన్నును రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ ఉర్సుగుట్టలోని రామసురేందర్‌ భవన్‌లో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులలో శనివారం ఆయన భవిష్యత్‌ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. అనంతరం సాగర్‌ మాట్లాడుతూ.. పత్తి దిగుమతులపై 11శాతం పన్నును రద్దు చేయడం భారత రైతాంగానికి ఉరి పేనడమేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని కోరారు. రైతాంగం సాగులో లక్షల రూపాయల పెట్టుబడితే.. పంట చేతికి వచ్చాక మద్దతు ధరలు అందక.. మార్కెట్‌లో దళారులకు కారుచౌకగా అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడులు చేతికి రాక దేశ రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని.. దేశ రైతాంగానికి అనుకూలమైన విధానాలను రూపొందించి అమలు చేస్తామని ప్రకటించిన మూడ్రోజులకే అమెరికా అధ్యక్షుని ఆంక్షలకు తలొగ్గి ఆగస్టు 19న పత్తి దిగుమతులపై 11శాతం సుంకాన్ని రద్దు చేశారని విమర్శించారు. పెట్టుబడిదారీ దేశాల దిగుమతులకు ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వానించడం దేశ రైతాంగానికి ఉరితాళ్లు వేయడమేనన్నారు.

రైతాంగానికి విత్తనాలు, ఎరువులు, సబ్సిడీపై అందించకుండా, పండించిన పంటలకు పెట్టుబడిపై 50శాతం కలిపి మద్దతు ధరలు అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగిస్తున్నారని అన్నారు. పత్తి క్వింటాల్‌కు రూ.10,075 నిర్ణయించాలని, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని సేకరించాలని డిమాండ్‌ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గొద్దని సూచించారు. పత్తి దిగుమతులపై 11శాతం పన్ను రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దిగుమతిపై 50శాతం పన్ను విధించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్‌ 25 నుంచి గ్రామాల్లో సభలు నిర్వహించి తీర్మానం కాపీలను ప్రధానమంత్రికి పంపే కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, ఏఐకేఎస్‌ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ఉపాధ్యక్షులు మాదినేని రమేష్‌, నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, ఈసంపల్లి బాబు, పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, శెట్టి వెంకన్న, బుర్రి శ్రీరాములు, బాలిరెడ్డి, ప్రముఖ సామాజికవేత్తలు దొంతి నరసింహారెడ్డి, భూపాల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -