జంతర్‌మంతర్ వద్ద ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల అందోళన
న్యూఢిల్లీ : డెహ్రాడూన్‌లో జరిగిన త్రిపుర విద్యార్ధి అంజెల్ చక్మా హత్యకు నిరసనగా దేశరాజధానిలోని జంతర్ మంతర్ ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, చక్మా హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థుల సంఘం (ఎన్‌ఈఎస్‌ఎస్‌డీయూ) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో దేశరాజధాని, పరిసర ప్రాంతాల్లో చదువుతున్న వందలాది మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఈ హత్య కేసు విచారణను సీబీఐకి బదలీ చేయాలని, చక్మా కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. జాతి వివక్ష, దాడుల నుంచి ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను రక్షించడానికి ఒక చట్టం ఉండాలి’ అనిఎన్‌ఈఎస్‌ఎస్‌డీయూ అధ్యక్షులు పాయింటింగ్ ధోక్‌చోమ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ హత్య కేసు దర్యాప్తును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, కాబట్టే న్యాయం కోసం విద్యార్థులు ఈ నిరసన ప్రదర్శనకు దిగాల్సి వచ్చిందని ఎన్‌ఈఎస్‌ఎస్‌డీయూ ఉపాధ్యక్షులు బిపుల్ చక్మా తెలిపారు. ‘నేను కూడా డెహ్రాడూన్‌లో జాతి వివక్షకు గురయ్యాను. ఇలాంటి జాతి వివక్షతను, ఈశాన్య రాష్ట్ర విద్యార్థులపై దుర్మార్గపు దాడులను ఆపాలని నేను కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
ఉత్తరాఖండ్ పోలీసుల వాదనను ఖండించిన చక్మా కుటుంబం
త్రిపుర విద్యార్ధి అంజెల్ చక్మా హత్య ఘటనపై విచారణకు ఉత్తరాఖండ్ పోలీసులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ను ఏర్పాటు చేశారు. ఈ బృందం చక్మా హత్య ఘటనలో ఎలాంటి జాతి వివక్ష కోణం లేదని తెలిపింది. అలాగే ఈ కేసులో ఆరుగురు నిందితులకు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృతుడు చక్మా కుటుంబం కూడా ఉత్తరాఖండ్ పోలీసుల వాదనను ఖండించింది. చక్మా తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు జాతి వివక్షను ఎదుర్కొన్నాడని, అతనిపై కత్తితో దారుణంగా దాడి చేశారని తెలిపారు. అలాగే, దాడి చేసిన దుండగులు ‘చైనీస్ మోమో’ అని తన కుమారుడ్ని ఎగతాళి చేసినట్టు చెప్పారు. త్రిపురకు చెందిన అంజెల్ చక్మా డెహ్రాడూన్‌లోని ఒక ప్రయివేటు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. డిసెంబరు 9న సాయంత్రం 6:15 గంటల సమయంలో డెహ్రాడూన్‌లో ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో అంజెల్ చక్మా, అతని సోదరుడు మైఖేల్ చక్మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అంజెల్ చక్మా చికిత్స పొందుతూ డిసెంబరు 26న మరణించారు. ఈ ఘటనలో మైఖేల్ చక్మా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్త్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆరుగురిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగుర్ని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
త్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మా హత్యకు నిరసన
- Advertisement -
- Advertisement -



