కౌలాలంపూర్‌లో కదం తొక్కిన ప్రజానీకం
ఇజ్రాయిల్ మారణహోమానికి మద్దతుపై మండిపాటు
పాలస్తీనాకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్
కౌలాలంపూర్ : ఆసియాన్ సదస్సుకు హాజరయ్యేందుకు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం నిరసనల స్వాగతాన్ని చవిచూశారు. మధ్యప్రా చ్యంలో అమెరికా మద్దతుతో జరుగుతున్న అణచివేతకు తక్షణమే స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రదర్శకులు దాతారన్ మర్కెడా సమీపంలో కదం తొక్కారు. వారంతా అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని వారంతా నిరసించారు. నల్లని దుస్తులు ధరించిన ప్రదర్శనకారులు ‘అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి’, ‘పాలస్తీనాకు స్వేచ్ఛ కల్పించాలి’, ‘ట్రంప్ హంతకుడు’ అని రాసివున్న బ్యానర్లు చేతపట్టుకొని ముందుకు నడిచారు. ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమానికి అమెరికా వత్తాసు పలుకుతున్నందున ఈ ప్రదర్శన చేపట్టామని బాయ్ కాట్, డైవెస్ట్‌మెంట్ అండ్ శాంక్షన్స్ (బీడీఎస్) మలేషియా సంస్థ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ మహమ్మద్ నజారీ ఇస్మాయిల్ తెలిపారు.
తన భాగస్వామి సాగిస్తున్న అరాచకాలను అమెరికా గుడ్డిగా సమర్ధించకుండా ఉండి ఉంటే పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ వేధింపులకు పాల్పడి ఉండేది కాదని ఆయన చెప్పారు. అమనాహ్ ఇంటర్నేషనల్ బ్యూరో చైర్మెన్ రాజా కమారుల్ బహరిన్ షా, మాజీ ఎంపీ తియాన్ చువా తదితర ప్రముఖులు ర్యాలీకి హాజరయ్యారు. అంపాగ్ పార్కులో ప్రదర్శన నిర్వహించాలని తొలుత నిర్వాహకులు భావించినప్పటికీ ఆ ప్రాంతం ఆసియాన్ సదస్సు ‘రెడ్ జోన్’ పరిధిలో ఉన్నందున దాతారన్ మర్కెడాకు మార్చామని పోలీసులు తెలిపారు. సదస్సు నేపథ్యంలో కౌలాలంపూర్‌లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పది వేల మందికి పైగా అధికారులను నియమించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నింటినీ మూసివేశారు.
లూలాతో భేటీ
ఇదిలావుండగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తొలిసారిగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పర్యటన ప్రారంభించారు. ఆసియాన్ సదస్సుకు హాజరైన ట్రంప్ పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సమావేశమయ్యారు. వాణిజ్య అంశాలు, ప్రతీకార సుంకాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయని సమాచారం.



