దక్షిణ కొరియా జియోంగ్జులో అమెరికా అధ్యక్షుడి వ్యతిరేక ప్రదర్శనలు
జియోంగ్జు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు విదేశీ పర్యటనల్లో ఊహించని విధంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.తాజాగా దక్షిణ కొరియా ఉత్తర జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లోని ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం ట్రంప్ వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, నినాదాలు హౌరెత్తించాయి.
ఏకపక్ష విధానాలు తగవు
ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు, కొరియాపై సుంకాల భారంతో తమ దేశానికి అన్యాయం జరుగుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనాకారులు నాటక ప్రదర్శన కూడా నిర్వహించారు.
”నో కింగ్స్: ట్రంప్ నాట్ వెల్కమ్”, ”నో టు ఏపీఈసీ” పోస్టర్లు
”ఆర్థిక వృద్ధి, శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీఈసీ అంటోంది. వాస్తవానికి ట్రంప్‌ను మచ్చిక చేసుకోవటానికి తమ దేశాధినేతలు బిజీగా ఉన్నారు” అని ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ జస్టిస్ పార్టీ అధిపతి క్వాన్ యంగ్-కూక్ అన్నారు. ”అంతర్జాతీయ క్రమాన్ని దెబ్బతీస్తున్న శక్తులను కూడా నిరోధించలేనప్పుడు.. ఒక ఏపీఈసీ సంస్థ వృద్ధి గురించి ఎలా మాట్లాడగలదు?” అని తెలిపారు. 35 వామపక్ష పౌర సమూహాలు , రాజకీయ పార్టీల సంకీర్ణమైన ఇంటర్నేషనల్ పీపుల్స్ యాక్షన్ కమిటీ ఎగైనెస్ట్ ది 2025 నేతృత్వంలో ఈ ప్రదర్శనను నిర్వహించింది. శిఖరాగ్ర సమావేశ ప్రధాన వేదికైన బోమున్ టూరిస్ట్ కాంప్లెక్స్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగింది. భద్రతా చర్యలు నిరసనకారులు ఆ ప్రదేశానికి చేరుకోకుండా నిరోధించాయి. పోలీసు అధికారులు నిరసన ప్రాంతం సమీపంలో కాపలాగా ఉన్నారు.
ట్రంప్ బుధవారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో బుసాన్‌లోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జియోంగ్జులో అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కొరియాలో ఆయన పర్యటనను దేశంలో కీలక పర్యటనగా నిర్వహిస్తున్నారు. ఇది ఒక దేశాధినేతకు అందించే అత్యున్నత దౌత్య మర్యాదగా అభివర్ణిస్తున్నారు. శిఖరాగ్ర సమావేశం జరిగే జియోంగ్జు నేషనల్ మ్యూజియం సమీపంలో ట్రంప్ వ్యతిరేక నిరసనకారుల బృందం పోలీసు వలయాలను ఛేదించి కార్యక్రమ స్థలాన్ని చేరుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ బృంద సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో ప్రదర్శనకారులకు కొద్దిసేపు పోలీసులతో ఘర్షణ జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పెట్రోలింగ్ టీములను రంగంలోకి దింపి బారికేడ్‌లను ఏర్పాటు చేశారు.
పలుచోట్ల ట్రంప్ వ్యతిరేక ర్యాలీలు
దేశంలో అతిపెద్ద కార్మిక సంస్థ అయిన కొరియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (కేసీటీయూ) జియోంగ్జు రైల్వే స్టేషన్ సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. యూనియన్ సభ్యులు , ప్రగతిశీల పౌర కార్యకర్తలు ”ట్రంప్ గో బ్యాక్ !” వంటి నినాదాలు చేస్తూ వీధుల గుండా కవాతు చేశారు.



