Friday, September 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినిరసన ఒకవైపు..ఎర్రతీవాచీ మరోవైపు

నిరసన ఒకవైపు..ఎర్రతీవాచీ మరోవైపు

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల బ్రిటన్‌ పర్యటన సందర్భంగా బుధవారం నాడు వేలాది మంది నిరసన ప్రదర్శనతో స్వాగతం పలికారు. రెండవసారి వచ్చిన ట్రంప్‌ దంపతులకు రాచమర్యాదలతో ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న బ్రిటన్‌ నేడు ప్రపంచ రాజకీయాల్లో, అమెరికా కను సన్నల్లో నడిచే ఒక అనుంగుదేశంగా పనిచేస్తున్నది. దిగజారిన దాని ఆర్థిక పరిస్థితే దీనికి కారణం. ఐరోపా సమాఖ్య నుంచి వెలుపలికి వచ్చిన బ్రిటన్‌ తన ప్రయోజనాల కోసం అమెరికా మీద ఆధారపడుతున్నది. అందుకు గాను అనేక అంశాలలో తాన తందాన అంటున్నది. ఈ ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బ్రిటన్‌ ఉక్కు మీద విధించిన 25శాతం అపరాధ పన్ను తొలగిస్తానని వాగ్దానం చేసిన అమెరికా ఇంతవరకు ఉలుకూ పలుకూ లేనప్పటికీ రాచ మర్యాదలు చేయటం ఏమిటని అనేక మంది విమర్శిస్తున్నారు.

ప్రపంచంలో అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాదం, వాతావరణ పరిరక్షణకు అడ్డుపడటం, జాత్యహంకారం, కార్మిక సంఘాలు, మానవహక్కుల అణచివేత విధానాలకు నిరసన తెలుపుతూ ట్రంప్‌ను అడ్డుకోవాలంటూ వేలాది మంది లండన్‌లో నిరసన తెలిపారు. పాలస్తీనాకు మద్దతు ప్రకటించారు. నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తే నిరసనశగ తగులుతుందనే భయం, ముందు జాగ్రత్తతో వెలుపల ఏర్పాటు చేశారు. ట్రంప్‌ను విమర్శించే లండన్‌ మేయర్‌ సాజిద్‌ ఖాన్‌ కనిపిస్తే ఎక్కడ ఆగ్రహం కలుగుతుందో అన్నట్లుగా ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మేయర్‌ను ఆహ్వానించకుండానే పనికానిచ్చారు. యు గవ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో జనం వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. ట్రంప్‌ పాలన బ్రిటన్‌కు ప్రతికూలంగా ఉన్నట్లు 53శాతం మంది పేర్కొన్నారు.ట్రంప్‌ను అడ్డుకోవాలంటూ ఏర్పడిన సంఘటన నేతలు మాట్లాడుతూ ప్రధాని స్టార్మర్‌ ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించాలని కోరేందుకే తాము వీధుల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దౌత్య సంబంధాలను కలిగి ఉండటం వేరు, ఒక నిరంకుశ నేతకు రాచమర్యాదలతో ఆహ్వానం పలకటం అవాంఛనీయమని స్పష్టం చేశారు.

యాపిల్‌, తదితర కంపెనీలు ఎక్కడో ఉత్పత్తులు తయారు చేయటంగాక అమెరికాలోనే పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించాలని, లేకుంటే తాటవలుస్తా అన్నట్లు బెదిరించిన ట్రంప్‌ సంగతి తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి అమెరికా కంపెనీల లాభాల కోసం వందల కోట్ల డాలర్లను బ్రిటన్‌లో పెట్టుబడులుగా పెట్టించి వాటికి పెద్ద మొత్తాల్లో రాయితీలు ఇప్పించేందుకు పర్యటనకు వచ్చాడు. అమెరికా బడా టెక్నాలజీ కంపెనీలకు దేశాన్ని ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ అమ్మివేస్తున్నాడని ట్రంప్‌తో కుదుర్చుకొనే ఒప్పందాలలో అమెజాన్‌, ఫేస్‌బుక్‌, పే పాల్‌ వంటి కంపెనీల యజమానులే లబ్ది పొందుతారని విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెబుతున్న ట్రంప్‌ నాయకత్వంలోనే అమెరికాకు చెందిన చిప్‌ తయారీ సంస్థ విడియా, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌,చాట్‌ జిపిటి సృష్టికర్త ఓపెన్‌ ఏఐ వంటి కంపెనీలన్నీ బ్రిటన్‌కు బారులుతీరుతున్నట్లు కుదిరిన ఒప్పందాలు వెల్లడిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రయివేటు రంగంలో అణువిద్యుత్‌ ఒప్పందాలు కూడా కుదిరాయి.

జనం వ్యతిరేకిస్తున్నప్పటికీ ట్రంప్‌కు ఎర్రతివాచీ పరచటం, అమెరికన్‌ కంపెనీలతో ఒప్పందాలకు బ్రిటన్‌ ఎందుకు వెంపర్లాడుతున్నదన్నది ఆసక్తి కలిగించే అంశం. దేశ ఆర్థికస్థితి తీవ్రంగా దిగజారింది.ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే స్థితిలేదు. జీడీపీతో పోల్చుకుంటే రుణభారం బాగా పెరిగింది. ఐదు దశాబ్దాల నాటి విపత్కర పరిస్థితి పునరావృతం కానుందా అన్నట్లుగా పరిస్థితి ఉన్నట్లు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1976లో బ్రిటన్‌ ప్రభుత్వం ఐఎంఎఫ్‌ నుంచి రుణం తీసుకుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ద్రవ్యలోటు 40 నుంచి 50 బిలియన్‌ పౌండ్లు ఉంది. దాన్ని పూడ్చుకోవాలంటే మరింతగా పన్నులు పెంచాలని వస్తున్న సూచనలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ద్రవ్యోల్బణం పద్దెనిమిది నెలల నాటి రికార్డు నాలుగుశాతాన్ని తాకింది. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడి దారుల్లో విశ్వాసం కనిపించటం లేదు. ఆర్థిక రంగంలో ఉద్దీపన కలిగించాలంటే పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేయాలి, దానికోసం అప్పులు తేవాల్సి ఉంది, అదే జరిగితే ఇప్పుడున్న రుణ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. దాని బదులు భారీగా రాయితీలిచ్చి అమెరికా నుంచి పెట్టుబడులను ఆకర్షించి కొంత మేర ఉపాధి కల్పించి యువతను సంతృప్తి పరచాలని చూస్తున్న ప్రభుత్వ యత్నాలు ఉపశమనం తప్ప పరిష్కారం కాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -