26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు
సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసనగా ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శన, ధర్నాలను నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి సాగర్, పాలడుగు భాస్కర్, ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 డిసెంబర్ 9న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడింపు ద్వారా వచ్చిన మిగులును రైతులకు పంచాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల చట్టం (సి2050) ప్రకారం కొనుగోలుకు గ్యారెంటీ చేయాలని కోరారు. రైతులు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలన్నారు.
రైతులకు వడ్డీ లేని రుణ పథకాన్ని అమలు చేయడానికి ఆర్‌బీఐ మిగులును నాబార్డ్‌కి బదిలీ చేయా లని డిమాండ్ చేశారు. విద్యుత్, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీ కరణ చేయొద్దనీ, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దనీ, విద్యుత్ బిల్లు – 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గృహవినియోగ దారులందరికీ నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇవ్వాలన్నారు. రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని కోరారు. అన్ని విపత్తు ప్రభావిత రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇవ్వాలనీ, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు పరిహారం ఇవ్వాలని కోరారు. నిజమైన నష్టాలకు పరిహారం తప్పనిసరి చేయడానికి భౌతిక సర్వే చేయించాలని సూచించారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలనీ, ఈ పథకం ద్వారా 200 రోజుల పని, రోజు కూలీ రూ.700 ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనీ, క్యాజువల్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలనీ, నియామకాలపై నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని కోరారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలనీ, రిజర్వేషన్లను కాపాడటానికి ప్రయివేటీకరణను ఆపాలనీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సామాజిక రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, కనీస వేతనాల హక్కును రక్షించాలనీ, సహజ వనరులపై గిరిజన హక్కులను కాపాడటానికి అటవీ హక్కుల చట్టం, పెసా (గిరిజన ప్రాంతాలలో పంచాయతీల విస్తరణ చట్టం) చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసీ వంటి కార్పొరేట్ సంస్థల ద్వారా పంటలు, పశువుల కోసం బీమాను నిర్వహించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తగ్గించిన రూ.87వేల కోట్ల ఎరువుల సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు.



