ప్రజలకు ఎన్.రామ్ పిలుపు
భారత విదేశాంగ విధానం మారుతోందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : ఇరాన్ తదితర దేశాలపై జరుగుతున్న సామ్రాజ్యవాద దాడుల పైన, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం పైన నిరసన వ్యక్తం చేయాలని ‘ది హిందూ’ గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని హెచ్‌కేఎస్ సూర్జిత్ భవన్‌లో ‘సామ్రాజ్యవాద దూకుడు…దాని ప్రభావం’ అనే అంశంపై ఆదివారం జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ‘మారుతున్న మన విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా, అలాగే వివిధ దేశాలు, వాటి ప్రజలపై జరుగుతున్న సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా ప్రజలంతా నిరసన తెలపాల్సిన సమయం ఆసన్నమైంది. పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సామ్రాజ్యవాద దాడులను ఎదుర్కొంటున్న వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున సంఘీభావం తెలపాలని అనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. ఈ సమావేశానికి భారత్‌లో క్యూబా రాయబారిగా పనిచేస్తున్న జువాన్ కార్లస్ మార్సన్ అగైలెరా, సీనియర్ పాత్రికేయురాలు సీమా చిస్తీ, వామపక్ష నేతలు హాజరయ్యారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘సిగ్గుచేటైన విధానా’న్ని అవలంబించిందని రామ్ వ్యాఖ్యానించారు. ‘ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై ద్రోహ బుద్ధితో దాడి ప్రారంభించాయి. దాని అధినేతను హతమార్చాయి. ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని నేను అనుకుంటున్నాను. ఇరాన్‌లో యుద్ధ నేరాలు, మానవతావాద నేరాలకు పాల్పడ్డారు. ఒక క్షిపణి దాడిలో పాఠశాల విద్యార్థినులను బలిగొన్నారు. ఈ ఘటనను ఖండించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. అయితే నిజం బయటికి వచ్చింది’ అని రామ్ తెలిపారు. ఇరాన్ సుప్రీం నేతను హతమార్చడాన్ని భారత్ ఖండించలేదని, పైగా ఇజ్రాయిల్‌లో ప్రధాని జరిపిన పర్యటన ద్వారా ఓ రకమైన కుట్ర జరిగిందన్న అభిప్రాయాన్ని సృష్టించిందని చెప్పారు. ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడి ప్రారంభించడానికి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఈ పర్యటన ఉపకరించిందని అన్నారు.
అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం, ఇజ్రాయిల్‌తో సంబంధాలను పెంచుకోవడం, వలసవాద వ్యతిరేక సంఘీభావాన్ని బలహీనపరచేందుకు కట్టుబడి ఉండడం…ఈ మూడు పరిణామాలు భారత విదేశాంగ విధానంలో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తున్నాయని, ఈ విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రామ్ తెలిపారు. పాలస్తీనా పోరాటం విషయంలోనూ భారత విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. ఇజ్రాయిల్ విధానాలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించలేకపోతోందని, ఆ దేశంతో వ్యూహాత్మక సహకారానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ‘రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దానిపై అన్ని ప్రధాన భారతీయ వార్తా పత్రికలలోనూ సిగ్గుచేటైన శీర్షికతో వార్త వచ్చింది. రష్యా చమురును 30 రోజుల పాటు దిగుమతి చేసుకునేందుకు భారత్‌ను అమెరికా అనుమతించిందన్నది ఆ శీర్షిక. కాబట్టి మనం ఈ అంశాలన్నింటిలోనూ అమెరికాకు సబార్డినేట్ భాగస్వామిగానో లేదా మిత్రదేశంగానో మారిపోయాం’ అని ఎన్.రామ్ చెప్పారు.



