రైట్ వింగ్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
పాల్గొన్న కార్మిక, పౌర సంఘాల కూటమి
లండన్ : రైట్ వింగ్ అతివాద రాజకీయాలకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు హౌరెత్తాయి. ఆందోళనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. పార్క్‌లేన్ నుంచి ట్రఫల్గర్ స్క్వేర్ వరకు మార్చ్ జరిపారు. కార్మిక సంఘాలు, పౌర సమాజ గ్రూపుల కూటమి దీనిని నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో వేలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. నిరసనకారులు సెంట్రల్ లండన్ వీధులకు చేరుకొని నినాదాలు హౌరెత్తించారు. ప్రధానంగా నైగెల్ ఫరాగె నేతృత్వంలోని రీఫార్మ్ యూకే పార్టీపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఎందుకంటే ఈ పార్టీ వలస వ్యతిరేక విధానాలతో ప్రస్తుతం ప్రజాభిప్రాయ సర్వేలలో ముందంజలో ఉంది. అయితే ఈ ఆందోళనలు బ్రిటన్ రాజధానిలో జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని నిర్వాహకులతో పాటు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీలో సుమారు పాల్గొన్న వేలాది మంది నిరసనకారులు వలస వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్, పాలస్తీనా మద్దతు జెండాలు కూడా అక్కడ కనిపించాయి. కాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ కంటే రీఫార్మ్ యూకే ముందంజలో ఉందని సర్వేలు చెప్తున్నాయి.



