Tuesday, September 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅవినీతిపై నిరసనలు సమర్థనీయమే

అవినీతిపై నిరసనలు సమర్థనీయమే

- Advertisement -

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు మార్కోస్‌

మనీలా : అవినీతి కుంభకోణాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వీధులలో ఆందోళన చేపట్టడాన్ని తాను తప్పుపట్టబోనని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినార్డ్‌ మార్కోస్‌ తెలిపారు.
ప్రజల నిరసన సమర్ధనీయమేనని ఆయన చెప్పారు. వరద నియంత్రణ ప్రాజెక్టులలో చోటుచేసుకున్న అవినీతిపై ఇటీవలి కాలంలో రాజధాని మనీలాలో అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి. యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు వేల మందికి పైగా విద్యార్థులు జరిపిన ప్రదర్శన కూడా వీటిలో ఒకటి. 1972లో మార్కోస్‌ తండ్రి విధించిన మార్షల్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. కుంభకోణంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆండ్రన్‌ రేయస్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కోస్‌ సోమవారం ప్రకటించారు. గత పది సంవత్సరాల కాలంలో వరద నియంత్రణ ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై ఈ కమిషన్‌ విచారణ జరుపుతుంది. ‘మీ ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయం కావాలని అడిగారు. అందులో తప్పేముంది?’ అని ప్రజలను ఉద్దేశించి మార్కోస్‌ ప్రశ్నించారు.

విచారణలో దోషులని తేలితే స్నేహితులు, బంధువులు సహా ఎవరినీ వదలబోమని మార్కోస్‌ స్పష్టం చేశారు. కుంభకోణంలో మార్కోస్‌ బంధువు, చట్టసభ స్పీకర్‌ మార్టిన్‌ రోమువాల్దెజ్‌ పాత్ర ఉన్నట్లు కొందరు సాక్షులు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మార్టిన్‌ తోసిపుచ్చారు. కాగా సుమారు 30 మంది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ వద్ద ముడుపులు తీసుకున్నారని ఓ నిర్మాణ సంస్థ యజమానులు గత వారం ఆరోపించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఫిలిప్పీన్స్‌లో అనేక కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. పలువురు కీలక రాజకీయ నాయకులు దోషులుగా తేలికనప్పటికీ జైలు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. 2023-25 మధ్యకాలంలో వరద నియంత్రణ ప్రాజెక్టులలో చోటుచేసుకున్న అవినీతి కారణంగా ప్రభుత్వ ఖజానాకు రెండు బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -