Saturday, January 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉపాధి నిర్వీర్యాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 15 వరకు నిరసనలు

ఉపాధి నిర్వీర్యాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 15 వరకు నిరసనలు

- Advertisement -

గ్రామస్థాయిలో ర్యాలీలు, సభలు, ఆందోళనలు నిర్వహించండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీఆర్‌ఏఎమ్‌జీ పథకాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 15 వరకు గ్రామస్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈ మేరకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందనీ, దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి గ్రామస్థాయిలో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గ్రామాల్లో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగానే యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందని వివరించారు.

గ్రామస్థాయి ఆందోళనల్లో ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్న మహాత్మాగాంధీ పేరును తీసేయడాన్ని తప్పుబట్టారు. కొత్త చట్టంలో నిధుల కోత, పనిదినాల కోత కుట్రకు తెరలేపిందని విమర్శించారు. కూలీల పొట్టగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. పాత చట్టంలో కేంద్రం 90 శాతం నిధులు భరిస్తుంటే, కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం సరికాదనీ, దీనివల్ల ఆర్థిక స్థోమత లేని రాష్ట్రాలు ఆ భారాన్ని భరించలేక పథకాన్ని ఆపేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ సీజన్లో 60 రోజుల పని దినాలను తొలగించాలనే నిబంధన కూలీలను తిరిగి యజమానుల వద్ద తక్కువ వేతనానికి బానిసలుగా మార్చే కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఈ కొత్త చట్టం వల్ల రాజ్యాంగం కల్పించిన ‘పని హక్కు’ను కూలీలు కోల్పోతున్నారని ఎత్తిచూపారు. తెలంగాణలోని దాదాపు 60 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ చట్టంపై ఆధారపడి ఉన్నారనీ, నిధులు, పనిదినాలు తగ్గిపోవడంతో కూలీలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీఆర్‌ఏఎమ్‌జీని వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, నరేగా చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పని దినాలను 200 రోజులకు పెంచడంతో పాటు రోజువారీ వేతనం రూ.800లకు పెంచాలనీ, పట్టణ పేదలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేయాలనీ, నిధులు మొత్తం కేంద్రమే భరించాలనీ, చట్టం అమలు బాధ్యత కేంద్రమే తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -