Thursday, January 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌లో నాలుగో రోజూ నిరసనలు

ఇరాన్‌లో నాలుగో రోజూ నిరసనలు

- Advertisement -

పెరుగుతున్న జీవనవ్యయంపై ప్రజాగ్రహం

టెహ్రాన్‌ : ఇరాన్‌లో జీవనవ్యయం భరించలేని స్థాయికి చేరడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బుధవారం వరుసగా నాలుగోరోజూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తాజాగా పది విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు కూడా ఆందోళనలో భాగస్వాములయ్యారు. వీటిలో రాజధాని టెహ్రాన్‌లోని ఏడు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నాయి. ఇస్ఫహాన్‌లోని టెక్నాలజీ యూని వర్సిటీలోనూ, యజ్డ్‌, జన్‌జన్‌ నగరాల్లోని సంస్థల్లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఆర్థిక ఇబ్బం దులతో సతమతమవుతున్నామని దుకాణ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో విద్యాసంస్థల వద్ద భద్రతా దళాలను, పోలీసులను మోహరించారు.

రాజధానిలో కొన్ని దుకాణాలు మూత పడ్డాయి. ఎముకలు కొరికే చలి వాతావరణం లో ఇంధనాన్ని ఆదా చేసే ఉద్దేశంతో సెంట్రల్‌ టెహ్రాన్‌లో బ్యాంకులు, పాఠశాలలు, వ్యాపార సంస్థలను మూసేశారు. డాలరుతో, ఇతర ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే ఇరాన్‌ రియాల్‌ మారకం విలువ దారుణంగా పడిపోయింది. సంవత్సరం క్రితం డాలరుతో పోలిస్తే రియాల్‌ మారకం విలువ 8,20,000 కాగా ఇప్పుడది 1.42 మిలియన్‌ రియాల్‌లకు పడిపోయింది. ఫలితంగా దిగుమతుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రిటైల్‌ వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారు. నగరంలోని అతి పెద్ద మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఆదివారం మొదలైన ప్రదర్శనలు క్రమేపీ ఊపందుకుంటున్నాయి. ధరల్లో నెలకొన్న హెచ్చుతగ్గుల కారణంగా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల అమ్మకాలు నిలిచి పోయాయి. అమ్మకందారులు, కొనుగోలుదా రులు కూడా లావాదేవీలకు దూరంగా ఉంటున్నారు.

దిగుమతుల ధరలు పెరిగిపోతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ డాలరు ధరతో కనీసం ఫోన్‌ కేస్‌ కూడా అమ్మలేం. అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు’ అని ఓ వ్యాపారి మండిపడ్డారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 52 శాతానికి చేరుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సెప్టెంబర్‌ చివరలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆంక్షలను పొడిగించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అణ్వాయుధాలను సముపార్జించుకునేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోందని పశ్చిమ దేశాలు, ఇజ్రాయిల్‌ ఆరోపిస్తుండగా టెహ్రాన్‌ దాన్ని తోసిపుచ్చుతోంది. కాగా సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో పోలిస్తే పెద్దగా అధికారాలు లేని దేశాధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ మంగళవారం కార్మిక నేతలతో సమావేశమయ్యారు. ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. నిరసనకారుల చట్టబద్ధమైన డిమాండ్లను వినాల్సిందిగా హోం మంత్రిత్వ శాఖను కోరానని ఆయన సోషల్‌ మీడియా పోస్టులో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -