Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండెన్మార్క్‌లో వెల్లువెత్తిన నిరసనలు

డెన్మార్క్‌లో వెల్లువెత్తిన నిరసనలు

- Advertisement -

ట్రంప్‌ చర్యలను నిరసిస్తూ వీధుల్లోకి వేలాదిమంది ప్రజలు
గ్రీన్‌లాండ్‌ రాజధానిలో కూడా ఆందోళనలు

కోపెన్‌హేగన్‌ : డెన్మార్క్‌ భూభాగంలో స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే చేస్తున్న బెదిరింపులను నిరసిస్తూ శనివారం వేలాదిమంది ప్రజలు రాజధాని కోపెన్‌హేగన్‌ వీధుల్లోకి వచ్చారు. ఖనిజ సంపన్నమైన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తన ప్రణాళికలను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్‌లు విధిస్తానంటూ శుక్రవారం ట్రంప్‌ హెచ్చరించారు. ఆ నేపథ్యంలో ఈ నిరసనలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో గ్రీన్‌లాండ్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. మార్చ్‌లు, ర్యాలీల్లో పాల్గొనాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన పిలుపులకు భారీ స్పందన కనిపించింది. డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ పతాకాలను ప్రదర్శిస్తూ ఆందోళనకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

వారి ప్రదర్శన శ్వేతారుణ వర్ణాల్లో సంద్రాన్ని తలపింపచేసింది. కోపెన్‌హేగన్‌ సిటీ హాల్‌ వెలుపల ప్రాంతమంతా నినాదాలతో హోరెత్తింది. గ్రీన్‌లాండ్‌ ప్రజాస్వామ్యం, ప్రాథమిక మానవ హక్కులను గౌరవించాలని స్పష్టమైన, సమైక్యతా సందేశాన్ని పంపాలన్నదే తమ లక్ష్యమని గ్రీన్‌లాండర్స్‌ అసోసియేషన్‌ ఉగట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గ్రీన్‌లాండ్‌ రాజధాని నూక్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే జరిగింది. ట్రంప్‌ చట్టవిరుద్ధమైన ప్రణాళికలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు నినదించారు. అమెరికా కాన్సులేట్‌ కార్యాలయానికి వారు గ్రీన్‌లాండ్‌ పతాకాలతో ప్రదర్శన నిర్వహించారు. గ్రీన్‌లాండ్‌ ప్రజలు, అలాగే డెన్మార్క్‌లో వున్న గ్రీన్‌లాండర్స్‌ అందరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఉగట్‌ అధ్యక్షురాలు జూలీ రాడ్‌మాచర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం నిర్ణయాధికారపు హక్కును గౌరవించాలని మేం కోరుకుంటున్నామని మరో నిర్వాహకుడు వ్యాఖ్యానించారు.

అమెరికన్‌ కాంగ్రెస్‌ బృందం పర్యటన
అమెరికన్‌ కాంగ్రెస్‌ నుంచి ద్విపక్ష ప్రతినిధి బృందం కోపెన్‌హేగన్‌లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కాగా ట్రంప్‌ ఆలోచనలను చాలామంది అమెరికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆ బృందం స్పష్టం చేసింది. డెన్మార్క్‌కు తన భూభాగాన్ని రక్షించుకునేంత సామర్ధ్యం లేదని ట్రంప్‌ సలహాదారు స్టీఫెన్‌ మిల్లర్‌ చేసిన వ్యాఖ్యలపై అమెరికా డెమోక్రటిక్‌ సెనెటర్‌ క్రిస్‌ కూన్స్‌ తీవ్రంగా స్పందించారు. అసలు గ్రీన్‌లాండ్‌కు ఎలాంటి భద్రతాపరమైన ముప్పులు ఇంతవరకు లేవన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -