Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌లో నిరసనలు హింసాత్మకం

పాక్‌లో నిరసనలు హింసాత్మకం

- Advertisement -

అమెరికా కాన్సులేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారి కాల్చివేత : 10 మంది మృతి
కరాచీ : ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా పాకిస్తాన్‌ కరాచీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం నిరసనకారులు అమెరికా కాన్సులేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో కనీసం 10 మంది మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ హత్య వార్త వెలువడిన వెంటనే, షియా ముస్లిం సంఘాలు కరాచీలోని అమెరికా కాన్సులేట్‌ వైపు భారీ ర్యాలీ నిర్వహించాయి.

నిరసనకారులు కాన్సులేట్‌ భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి, లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం జరిపిన కాల్పుల్లో 10 మంది నిరసనకారులు మరణించారు. దీనిపై సింధ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి జియావుల్‌ హసన్‌ లంగర్‌ మాట్లాడుతూ ”చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించం” అని స్పష్టం చేశారు. నిరసనకారులను అమెరికా మెరైన్లు కాల్చివేశారనే ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఇతర నగరాల్లో నిరసనలు, భద్రతా చర్యలు
ఖమేనీ హత్య నేపథ్యంలో ఇస్లామాబాద్‌, లాహోర్‌లలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఇస్లామాబాద్‌లో, తెహ్రీక్‌- ఎ- జాఫరియా పాకిస్తాన్‌ అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా, అధికారులు రెడ్‌ జోన్‌ను మూసివేసి, అదనపు బలగాలను మోహరించారు. రెడ్‌ జోన్‌ వైపు ప్రయాణించవద్దని ఇస్లామాబాద్‌ పోలీసులు పౌరులను కోరారు. జిల్లా యంత్రాంగం ఇస్లామాబాద్‌లో సెక్షన్‌ 144ను అమలు చేసింది, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా లాహోర్‌ ప్రెస్‌ క్లబ్‌ వెలుపల నిరసనలు కొనసాగాయి. కరాచీ, లాహోర్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ వద్ద జరుగుతున్న నిరసనల నివేదికలను పర్యవేక్షిస్తున్నామని ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, పెషావర్‌ కాన్సులేట్‌ జనరల్‌ వద్ద ప్రదర్శనలను కూడా పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు వ్యక్తిగత భద్రతా పద్ధతులను పాటించాలని, పెద్ద జనసమూహాలకు దూరంగా ఉండాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -