సీఎస్‌తో టీజీఈజేఏసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 17న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలుపనున్నట్టు టీజీఈజేఏసీ (తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ జేఏసీ) తెలిపింది. శుక్రవారం హైదరాబాద్ లో జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు, నాయకులు పి.దామోదర్ రెడ్డి, బి. శ్యామ్, జి.సదానందం గౌడ్, కటకం రమేష్, డాక్టర్ రామారావు, భిక్షం గౌడ్, జుట్టు గజేందర్, పి.వెంకట్ రెడ్డి, పర్వత్ రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కలిసి నిరసన సమాచారాన్ని తెలిపారు. ఈ నెల 7న జేఏసీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం తీసుకున్న తీర్మానాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 17న 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ, సచివాలయం, మండల, డివిజన్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 15.25 లక్షల ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న 206 సంఘాల తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ ఏర్పాటు అయ్యి దాదాపు 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో 51 శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్సీన నివేదికను వెంటనే తెప్పించి, జూన్ 2లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్టు హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు రూ.13 వేల కోట్ల పెండింగ్ బిల్లులను ఏకమొత్తంగా విడుదల చేసి, ప్రతినెల రిటైర్ అవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని వెంటనే తొలగించి, కొత్త ఈహెచ్‌ఎస్ విధివిధానాలను రూపొందించి, మే 1 నుంచి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి ఒపీఎస్ ను పునరుద్ధరించాలని, అలాగే 01-09-2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే ఒపీఎస్ నుఅమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మిగిలిన దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న 64 అంశాలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని జేఏసీ కోరింది.
17న నల్ల బ్యాడ్జీలతో నిరసనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



