– ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ఘర్షణ
– పలువురు పోలీసులు, నాయకులకు గాయాలు
నవతెలంగాణ-సిరిసిల్ల
సిరిసిల్లలో ప్రొటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా ఇరు పార్టీల నేతలు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పొటో పెట్టాల్సిందేనని, లేకపోతే కార్యక్రమాలను అడ్డుకుంటామని ఒక బీఆర్‌ఎస్ నాయకుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. దీనికి ప్రతిగా ఓ కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెడతామని అదే సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు కూడా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ముందే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువురినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలపై స్వల్ప లాఠీచార్జి చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణలో పోలీసులతోపాటు పలువురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.
సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES