Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌లో 'ప్రొటోకాల్‌' పంచాయితీ

కాంగ్రెస్‌లో ‘ప్రొటోకాల్‌’ పంచాయితీ

- Advertisement -

‘ఎవరికి వారే’ అన్నరీతిలో పెద్దపల్లి ‘పార్లమెంట్‌’లో డ్రామా
శిలాఫలకాల నుంచి పుష్కరాల వరకూ ‘సమన్వయం’ గొడవే..
తాజాగా కాళేశ్వరం పుష్కరాల్లో ఎంపీ పేరు మాయం
వారి ఇగోల నడుమ నలుగుతున్న అధికారులు
జగిత్యాలలో అలకవీడని సీనియర్‌ నేత
అభివృద్ధి పనులకొచ్చిన మంత్రులపై సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కోల్‌సిటీ
పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో ప్రొటోకాల్‌ పంచాయితీ నడుస్తోంది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడటం.. పార్టీ ముఖ్యనేతల సమన్వయాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు బహిర్గతమవడంతో ఈ అంతరం స్పష్టమైంది. ఎంపీ వర్గీయులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడం, అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరగడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జగిత్యాల జిల్లాలో సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ఇంకా అలకవీడలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా అసహనం వెళ్లగక్కుతున్న ఆయన తాజాగా ‘మా పనైపోయింది. మీరే రాజ్యం ఏలండి’ అంటూ శుక్రవారం రాత్రి జిల్లాకు వచ్చిన మంత్రి ‘పొంగులేటి’తో ముభావంగా ఉండటం, అదే సమయంలో ‘జీవన్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ అనుచరులు చేసిన హంగామా మరోమారు ఆ పార్టీలో గొడవకు ఆస్కారం ఏర్పడినట్టయింది. ఈనెల 15న కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఫ్లెక్సీల్లో ఎంపీ పేరు, ఫొటోలను ప్రస్తావిం చకపోవడంతో ఎంపీ అనుచరులు ఆందోళనకు దిగారు. గతేడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాల్లో తనకు తగిన గౌరవం ఇవ్వకపోవడంపై ఎంపీ వంశీకృష్ణ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్‌జీ-1 ఏరియాలో అభివృద్ధి పనుల శిలాఫలకంలో ఎంపీ పేరు లేకపోవడంపైనా వివాదం చెలరేగింది. ఎంపీ జోక్యంతో శిలాఫలకం మార్చినప్పటికీ, వరుస ఘటనలు సమన్వయ లోపాన్ని స్పష్టం చేశాయి.
మధ్యలో నలుగుతున్న అధికారులు
పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బెల్లంపల్లిలో ఎంపీ తండ్రి వివేక్‌ వెంకటస్వామి, మందమర్రిలో పెద్దనాన్న ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, సమన్వయం కొరవడటం ఆశ్చర్యకరంగా మారింది. ప్రొటోకాల్‌ ప్రకారం.. స్థానిక సమస్యలను ఎమ్మెల్యేలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లి, ఎంపీ ల్యాడ్స్‌ నిధులు, కేంద్ర పథకాల ద్వారా పరిష్కరించాలి. కానీ, ఎమ్మెల్యేలు ఈ విధానాన్ని పాటించడం లేదని ఎంపీ అనుచరులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారిక కార్యక్రమాల్లో ఎంపీకి తగిన స్థానం కల్పించడం లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేసే యోచనలో ఎంపీ అనుచరులు ఉన్నట్టు సమాచారం.
జగిత్యాలలో మరోమారు జీవన్‌రెడ్డి అసంతృప్తి
జగిత్యాలలో సీనియర్‌ నేతగా ఉన్న జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఇంకా అసంతృప్తిని వీడటం లేదు. పైకి పార్టీ విధేయునిగా ఉంటున్నానని చెబుతున్నా సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ పెద్దలపైనా, మంత్రులపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిననాటి నుంచి ఆయనకు ప్రాధాన్యత తగ్గుతూ రావడం, తాను పార్టీ ముందు, ప్రభుత్వానికి విన్నవిస్తున్న ఏ సమస్యనూ పరిష్కరించడం లేదనే ఆవేదన ఆయన్ను మరింత కుంగదీస్తోందని అనుచరులు చెబుతున్నారు. తాజాగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అంశాలపై సమీక్షకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమం అనంతరం జీవన్‌రెడ్డిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ, వెంటనే ఆయన్ను పక్కకునెట్టి ముభావంగా అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -