రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అమలుల్లోకి తీసుకొచ్చిన మీడియా అక్రిడిటేషన్ విధానం వివరాలను, విధివిధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మెన్‌లకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అక్రిడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, క్రియేటివ్ ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్ వేసిన మూడు పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది.
కేబుల్, డిజిటల్ మీడియా సంస్థలకు నిర్ణయించిన ప్రమాణాలు అన్యాయమనీ, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని పిటిషనర్ల అడ్వొకేట్ వాదించారు. అక్రిడేషన్ దరఖాస్తుల గడువు ఈ నెల 28తో ముగిస్తుందనీ, గడువు సమీపిస్తున్నందున జీవో అమలుపై తక్షణం నిలుపుదల చేస్తూ స్టే విధించాలని కోరారు. దీనికి ప్రతిస్పందించిన ప్రభుత్వ న్యాయవాది, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు రెండు నెలలు పొడిగించినట్టు చెప్పారు. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన కోర్టు, కౌంటర్ తర్వాత పిటిషనర్లు రెండు వారాల్లో తమ రిప్లైలు సమర్పించాలని ఆదేశించింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక జరిగిందో లేదో చెప్పండి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించారా లేదా, ఫలితాలు ప్రకటించారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలంది. తాను చైర్మెన్‌గా ఎన్నికైనప్పటికీ అధికారికంగా ప్రకటించలేదంటూ టి. సుదర్శన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారించారు. వార్డు కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ అయ్యారనే ఆరోపణల నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలై, మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నిక నిలిచిపోయిందని న్యాయవాది వివరించారు. అయితే, కోర్టు ఆదేశాల జారీ అయ్యేప్పటికే ఎన్నిక ప్రక్రియ పూర్తయిందనీ, అయితే ఎన్నిక ఫలితాన్ని మాత్రం ప్రకటించలేదన్నారు. మున్సిపాలిటీలో 24 మంది సభ్యుల్లో 13 మంది బీఆర్‌ఎస్, ఒకరు బీజేపీ, ఒకరు స్వతంత్ర సభ్యుడు కలిసి బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని తెలిపారు. మరోవైపు యాదగిరి తరఫు న్యాయవాది, ఆయనను అపహరించి బాపట్లలోని ఫాంహౌస్‌లో నిర్బంధించారని చెప్పారు. కలెక్టర్ వివరణ కోసం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
అగ్నిమాపక శాఖలో వసతులపై వివరణ ఇవ్వండి
విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న సౌకర్యాలు, పరికరాలు, సాంకేతిక వనరుల వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యంత్రాల పరిస్థితి, ఆక్సిజన్ మాస్క్‌లు, నీటి సరఫరా వసతులు తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలంది. ఈ కేసులో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ జనరల్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్, సిటీ పోలీస్ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చి కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందిన ఘటనపై జ్యుడిషియల్ విచారణ కోరుతూ వచ్చిన లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ విచారించింది. అత్యాధునిక పరికరాల కొరత, ఆక్సిజన్ మాస్క్‌ల లేమి, సకాలంలో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులు చేరకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని లేఖలో ఆరోపించారు.
అక్రిడిటేషన్ విధివిధానాల నివేదిక ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



