Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక ఎన్నికలపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

స్థానిక ఎన్నికలపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికలను 50 శాతం రిజర్వేషన్లతో జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంపు జీవోపై స్టే జారీ, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌ చేసిన నేపథ్యంలో ఎన్నికలపై ఏం చర్యలు తీసుకునేదీ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ను వివరణ కోరింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను సస్పెండ్‌ చేస్తూ ఈనెల 9న ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్‌లను అడ్వకేట్‌ సురేందర్‌ సవాల్‌ చేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం విచారించింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను మాత్రమే హైకోర్టు స్టే విధించిందనీ, ఎన్నికల నోటిఫికేషన్‌పై కాదనీ, కాబట్టి పాత రిజర్వేషన్ల విధానంలో ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ లాయర్‌ కోరారు. హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు ఎస్‌ఎల్‌పిని కొట్టివేసిన తరుణంలో తాము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఎలక్షన్‌ కమిషన్‌ కౌన్సిల్‌ విద్యాసాగర్‌రావు చెప్పారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి అనుగుణంగా స్థానిక పదవుల రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిందనీ, తాజా తీర్పుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు 25 శాతంతో పదవుల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సివుందని తెలిపారు. దీంతో ఎన్నికలపై ఏం చేయబోయేదీ చెప్పాలన్న డివిజన్‌ బెంచ్‌ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

భూదాన్‌ భూములపై స్టే కొనసాగింపు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌ భూములపై ఏప్రిల్‌లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆధికారులు, ఇతరులు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గత ఏప్రిల్‌ 24న స్టే ఉత్తర్వులు అమల్లో ఉండాల్సిందేనని చెప్పింది. సర్వే 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలనే ఆదేశాలను సవరించేందుకు కూడా నిరాకరించింది. ప్రతివాదులుగా ఉన్న పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై ఆరోపణలు తీవ్రమైనవని గుర్తు చేసింది. అందులో ఒక ప్రతివాది రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా చేసినప్పుడు తీవ్ర ఆరోపణలున్నాయని చెప్పింది. కాబట్టి స్టే ఎత్తేయాలని ఐఏఎస్‌లు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్‌(ఐఏ)లను కొట్టివేస్తున్నట్టు జస్టిస్‌ లక్ష్మణ్‌ ప్రకటించారు. 181, 194, 195 సర్వే నెంబర్లలోని భూమి కబ్జాకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేష్‌ వేసిన పిటిషన్‌లో గతంలోని స్టే ఆదేశాలు కొనసాగుతాయని చెప్పారు.

ఈ భూములను విక్రయించడం, బదిలీ చేయడం వంటి చేయరాదని గతంలోనే ఆదేశిస్తే దీనిని కొందరు ఉన్నతాధికారులు డివిజన్‌ బెంచ్‌ వద్ద అప్పీల్‌ చేశారు. బెంచ్‌ ఆదేశాలు ఇవ్వలేదు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ ఇచ్చిన స్టే ఆదేశాలను రద్దు చేయాలన్న మధ్యంతర పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు సింగిల్‌ జడ్జి ప్రకటించారు. ఈ భూములపై తమకు పట్టాలున్నాయంటూ చిరంజీవి రాజు సహా 30 మంది వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లను విచారిస్తామని చెప్పింది. ఈ భూములపై విచారణ కమిషన్‌ వేయాలంటూ పడమటి తండాకు చెందిన రాములు దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కొట్టివేసింది. నాగారంలోని సర్వే నంబర్‌ 194 భూమికి సంబంధించి మ్యుటేషన్‌ ప్రొసీడింగ్‌లు, పట్టాదార్‌ పాస్‌బుక్‌ల జారీ తదితర కాపీలను తాను మే 9న వినతిపత్రం సమర్పించినప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బిర్లా మహేశ్‌ వేసిన మరో పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, పత్రాల సర్టిఫైడ్‌ కాపీలను అందించడానికి నిర్దిష్ట అభ్యర్థనతో అధికారులకు తగిన దరఖాస్తును సీసీఎల్‌ఏకు చేసుకోవచ్చునని చెప్పింది. ప్రధాన కేసు విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -