Thursday, October 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభవిష్య నిధి..భరోసా ఏదీ?

భవిష్య నిధి..భరోసా ఏదీ?

- Advertisement -

ఈపీఎఫ్‌వో బాధ్యత నుంచి తప్పించుకుంటున్న కేంద్రం
వడ్డీ భారాన్ని ఎగ్గొట్టేందుకే నిబంధనలు సడలింపు
రిటైర్‌మెంట్‌ పెన్షన్‌కూ తిలోదకాలు
దానిలో భాగంగానే వంద శాతం విత్‌డ్రాకు అనుమతి
ఉద్యోగుల భవితకు ప్రమాదం

కిరణ్‌ ప్రయివేటు ఉద్యోగి. జీతం రూ.30వేల లోపే. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు ఉన్నాయి. పదేండ్లుగా ఒకే సంస్థలో పనిచేస్తుండటంతో పీఎఫ్‌ అక్కౌంట్‌లో కాస్తో కూస్తో సొమ్ము జమ అయ్యింది. ఎన్ని ఆర్థిక అవసరాలు వచ్చినా, నిబంధనలు కఠినంగా ఉండటంతో పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకుందామనే ఆలోచన రాలేదు. రిటైర్‌మెంట్‌ తర్వాత ఆ సొమ్ము చేతికి వస్తే, వృద్ధాప్యంలో కొంత ఆర్థిక చేయూత ఉంటుంది. దానికి తోడు ఎంతోకొంత నెలవారీ పెన్షన్‌ కూడా వస్తుంది కాబట్టి జీవితాన్ని మెల్లగా కొనసాగించేయోచ్చు అనుకొనేవాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌ఓ నుంచి వందశాతం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చంటూ నిబంధనలు సడలించాక, ఇప్పుడు అతని కొడుకు లేటెస్ట్‌ మోడల్‌ బైక్‌ కావాలంటూ ప్రాణం తోడేస్తున్నాడు. ఆ బాధ భరించలేక పీఎఫ్‌ సొమ్ము మొత్తం డ్రాచేసి కొడుక్కి బైక్‌ కొనిచ్చాడు. అవసరం తీరింది…కానీ కిరణ్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది.

వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కరువైంది. కిరణ్‌కు పీఎఫ్‌ మొత్తం చెల్లించేశాక, కేంద్ర ప్రభుత్వానికి అతని సొమ్ముపై ప్రస్తుతం ఇస్తున్న 8.25 శాతం వడ్డీ మిగిలిపోయింది. అతనికి ప్రతినెలా పెన్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యతనూ వదిలించుకున్నట్టు అయ్యింది. చిరుద్యోగులకు ఆర్థిక అవసరాలు ఎక్కువ. అవకాశం ఉంటే, అప్పు చేసేకన్నా, ఉన్న వెసులుబాటును వాడేసుకుందామనే ఆలోచనే ముందుగా వస్తుంది. కానీ ఆ అవసరం తమ భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తుందనే స్పృహలోకి వచ్చేసరికి కాలం కరిగిపోతుంది. ఉద్యోగులకు తమకు తెలీకుండా, పొదుపు జరిగేది ఒక్క భవిష్యత్‌ నిధి (పీఎఫ్‌) ద్వారానే. సంక్షేమ పథకాల నుంచి క్రమంగా వైదొలుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పీఎఫ్‌ను కూడా వదిలించుకోవడానికే సిద్ధపడింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయాల వల్ల కొందరికి మేలు జరగొచ్చేమోనని అనిపిస్తున్నా, అనేకమంది భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుంది.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులకు భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆ సంస్థకు ఉన్నది. కానీ ఉద్యోగుల ఆశలపైనా, వారి భవిష్యత్‌పైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రయివేటు సంస్థల్లోని ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. ఈపీఎఫ్‌వో బాధ్యతల నుంచి తప్పించుకోవాలని కుట్ర పన్నుతున్నది. అందులో భాగంగానే ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) నుంచి ఉపసంహరణలను ఈపీఎఫ్‌వో సులభతరం చేసింది. అర్హత కలిగిన నిల్వల నుంచి వంద శాతం వరకూ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయం ఉద్యోగులకు మేలు కలిగిస్తుందనే అభిప్రాయాలకంటే, నష్టాన్నే ఎక్కువ మిగులుస్తుంది. అవసరాలున్న ఉద్యోగులకు వంద శాతం నిల్వలు ఉపసంహరించుకుంటే ఉపయోగమే అవుతుంది.

పైకి చూడ్డానికి ఉద్యోగులకు మేలు కలుగుతుందన్నట్టు కనిపించినా ఈ నిర్ణయం తేనె పూసిన కత్తిలాంటిది. తాత్కాలిక అవసరాల కోసం ఆ సొమ్మును వాడేసుకుంటే సదరు ఉద్యోగి కుటుంబానికి భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్య నిధి అంటేనే భవిష్యత్‌ కోసం దాచుకునే సొమ్ము. ప్రతినెలా ఉద్యోగి, సంస్థ వాటాకు ఈపీఎఫ్‌వో 8.25 శాతం వడ్డీ జమ చేస్తుంది. భవిష్యనిధి బాధ్యతల నుంచి తప్పించుకోవడంతోపాటు ఈ వడ్డీ చెల్లింపు, పెన్షన్‌ను ఎగ్గొట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని పలువురు ప్రయివేటు ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయం ఉద్యోగుల భవితకు ప్రమాదకరంగా మారింది. వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కరువైంది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈపీఎఫ్‌వో మనుగడ ప్రశ్నార్థకం?
ఉపసంహరణల కోసం గతంలో ఉన్న 13 రకాల నిబంధనలను ఈపీఎఫ్‌వో సీబీటీ సరళీకరించింది. అత్యవసర (అనారోగ్యం, విద్య, వివాహం), గృహవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా విభజించి అర్హత కలిగిన నిల్వల నుంచి వంద శాం సొమ్మును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. వివాహం, విద్య కోసం సర్వీసులో మూడు సార్లే ఉపసంహరించుకోవాలన్న నిబంధనకు సడలింపు నిచ్చింది. విద్య కోసం పదిసార్లు, వివాహానికి ఐదు సార్లు ఉపసంహరించుకోవచ్చని చెప్పింది. మరోవైపు ప్రత్యేక పరిస్థితుల కింద ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఉపసంహరణకు దరఖాస్తు చేసు కునేలా అనుమతినిచ్చింది. ఈ నిర్ణయంతో ఏడు కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూర నుందని తెలిపింది. సర్వీసు మొత్తంలో విద్య కోసం పది సార్లు, వివాహానికి ఐదు సార్లు నిల్వలో ఉన్న సొమ్మును వంద శాతం ఉపసంహరించు కోవడానికి అనుమతి ఇవ్వడంతో ఈపీఎఫ్‌వోలో నిల్వలు ఉండే అవకాశం లేదు.

దీంతో కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించే అవసరం ఉండదు అప్పుడు ఈపీఎఫ్‌వోకు మనుగడ ఉంటుందా?అనే ప్రశ్న ఉత్పన్నమ వుతున్నది. ఆ సంస్థ ఉండడం వల్లే పీఎఫ్‌ సొమ్మును దాచుకున్న ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రత దొరుకుతున్నది. భవిష్యత్‌కు భరోసా లభిస్తున్నది. ఆ సొమ్మును పిల్లల పెండ్లి, ఇంటిస్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, ఆరోగ్యం వంటి అవసరాలకు వాడుకోవడానికి అవకాశమున్నది. సర్వీసులో ఉన్నపుడే ఈపీఎఫ్‌వోలో సొమ్మంతా వాడుకుంటే రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే వారు ఈపీఎఫ్‌వో నిబంధనల సడలింపు పేరుతో తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోరుతున్నారు.

భవిష్యనిధి సొమ్మును భద్రంగా ఉంచుకోవాలి : వీఎస్‌ రావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
భవిష్యనిధిలో దాచుకున్న సొమ్మును ఉద్యోగులు, కార్మికులు భద్రంగా ఉంచుకోవాలి. ఉద్యోగుల ప్రయోజనం పేరుతో పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ భారం నుంచి తప్పించుకోవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కార్మికుల ప్రయోజనం కోసం కాదు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. భవిష్యనిధిని ఉపసంహరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబాలకు ఆర్థిక భద్రత ఉండదు : విఎస్‌ బోస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి
పీఎఫ్‌ సొమ్మును మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ సంస్థ పేరే భవిష్యనిధి. ఆ సంస్థకు భవిష్యత్‌ లేకుండా చేస్తున్నారు. ఆ సొమ్మును కొద్దిమంది ఉపయోగకరంగా ఉండేలా దాచుకోవడం లేదంటే పెట్టుబడి పెడతారు. కొందరు దుర్వినియోగం చేస్తారు. అలాంటి వారు దుర్వినియోగం చేసుకోకుండా ఉండేందుకే రిటైర్మెంట్‌ తర్వాత భరోసా కల్పించడం కోసమే ఈపీఎఫ్‌ను తెచ్చారు.రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసమే ఆ సొమ్మును వినియోగిస్తారు. కానీ కేంద్రం నిర్ణయం వల్ల ఉద్యోగుల కుటుంబాలకు భవిష్యత్‌లో ఆర్థిక భద్రత ఉండబోదు.

పెన్షన్‌ ఎత్తేయాలని చూస్తున్న కేంద్రం : పి కృష్ణమూర్తి, తెలంగాణ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి
ఉద్యోగులకు పెన్షన్‌ పథకాన్ని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. పీఎఫ్‌ నిధులు వంద శాతం ఉపసంహరించిన తర్వాత పెన్షన్‌ బాధ్యత నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నది. ఉద్యోగుల భవిష్యత్‌కు ఎలాంటి భద్రత లేకుండా చేస్తున్నది. ఈపీఎఫ్‌వో బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తున్నది. వడ్డీ భాగం ఇవ్వకుండా ఉండేందుకే ఈపీఎఫ్‌వో సడలింపు నిబంధనలను తెచ్చింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -