Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeమానవినేత కార్మికుల‌కు ఉపాది క‌ల్పిస్తూ..

నేత కార్మికుల‌కు ఉపాది క‌ల్పిస్తూ..

- Advertisement -

చేనేత అంటే ఆదాయం లేని వృత్తిగా మారింది. సరైన ఉపాధిలేక నేత కార్మికులు తల్లడిల్లిపోతున్నారు. అలాంటి కుటుంబంలోనే పుట్టింది గజం నర్మద. అయితే చేనేతలో వృద్ధిలేదని అందరిలా ఆమె కుంగిపోలేదు. భర్త చేయి పట్టి మహానగరానికి అడుగుపెట్టింది. చీరలు అమ్మడం మొదలుపెట్టింది. తనలోని నైపుణ్యంతో వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చింది. కేవలం తమ ఒక్క కుటుంబం వృద్ధిలోకి వస్తే సరిపోదని చేనేత కుటుంబాలకు అండగా నిలవాలని భర్త సహకారంతో టెక్స్‌లైల్స్‌ సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం మూడు వందల చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. ఈ కృషికి గుర్తుగా ప్రభుత్వం ఉత్తమ వ్యాపారవేత్తగా ఆమెను ఎంపిక చేసింది. ఆగస్టు 7న ఢిల్లీలో జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…

నల్గొండ జిల్లా, కనగల్‌ మండలం, సబ్దుల్లాపురం గ్రామం నర్మద సొంత ఊరు. తల్లి గంజి రాములమ్మ, తండ్రి ముత్యాలు. వీరిది చేనేత కుటుంబం. నర్మద ఏడవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకుంది. ఆ తర్వాత అక్కడి పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేక పోవడంతో ఆ కుటుంబం నల్గొండకు వచ్చేసింది. ఇంటర్‌ రెండవ ఏడాది చదువుతుండగా 1998లో గజం కమలమ్మ, గజం చంద్రయ్యల కొడుకు గజం నరేందర్‌తో ఆమె వివాహం జరిగింది. అప్పటికే నరేందర్‌ వారి కుటుంబం స్వయంగా నేసిన చీరలు అమ్ముతూ ఉండేవారు. మార్కెటింగ్‌ పెద్దగా ఉండేది కాదు. దాంతో భార్యా, భర్తలు హైదరాబాద్‌ వచ్చేశారు. కొత్తలో ఐదూ పది చీరల కంటే అమ్ముడు పోయేవి కావు.

వ్యాపారంలో నైపుణ్యం
హైదరాబాద్‌లోని కొత్తపేటలో అద్దె ఇంట్లూ ఉంటూ తమ వ్యాపారం మొదలుపెట్టారు. 2000లో భర్తతో కలిసి ఆమె కూడా చీరలు అమ్మేది. చీరలు అమ్మడం, మంచి మంచి చీరలను డిజైన్‌ చేయడం, వాటిని తొందరగా సేల్‌ చేయడంలో నర్మద మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేది. అయితే గ్రామాల్లో చేనేతకు అవకాశాలు లేక తల్లడిల్లుతున్న నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని, చేనేతను మరింత ముందుకు తీసుకెళ్లాలని నర్మద నిర్ణయించుకుంది.

భర్త ప్రోత్సాహంతో…
నర్మదలోని నైపుణ్యాలను, చేనేతపై ఉన్న ఆసక్తిని గమనించిన భర్త 2013లో పది లక్షలతో నరేందర్‌ టెక్స్‌టైల్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. దీనికి ప్రొప్రైటర్‌గా నర్మదను నియమించారు. చేనేత కుటుంబంలో పుట్టినప్పటికీ నర్మదకు పెండ్లి తర్వాతనే ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. భర్త ప్రోత్సహంతోనే మార్కెటింగ్‌లోకి ప్రవేశించింది. దీనికి తోడు అత్తమామలు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. ప్రస్తుతం వీరికి బొమ్మన బ్రదర్స్‌, చందన బ్రదర్స్‌ నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇదంతా కుటుంబ సహకారం వల్లనే సాధ్యమైందని ఆమె ఆనందంగా చెబుతుంది.

ఎనిమిది కోట్ల టర్నోవర్‌
2013లో పది లక్షలతో ప్రారంభమైన నర్మద చేనేత మార్కెటింగ్‌ అంచలంచలుగా ఎదిగి నేడు 300 మంది చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. వ్యాపారాన్ని ఎనిమిది కోట్ల టర్నోవర్‌ వరకు వృద్ధి చేసింది. తమ సంస్థ ఆధ్వరంలో చేనేత రంగానికి మార్కెటింగ్‌ కల్పించి ప్రతి కుటుంబానికి పని కల్పిస్తున్నామని ఆమె అంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు స్టాల్స్‌ ఏర్పాటు చేయడంతో ప్రారంభించిన వారి ప్రస్థానం హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబైతో పాటు ఇతర దేశాల్లో కూడా స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఇక్కత్‌ చీరలను ప్రచారం చేస్తున్నారు. కరోనా కాలంలో కూడా వీరు ఆ 300 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. ఇలా మార్కెటింగ్‌ రంగంలో రాణించి ఆగస్టు 7వ తేదీన టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి చేతుల మీదగా ఢిల్లీలో ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు. భవిష్యత్తులో విదేశాలలో కూడా తమ బిజినెస్‌ ప్రారంభించి చేనేతను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు.
– పాక జహింగీర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad