– భారీ రక్తదాన శిబిరం, 153 మంది ఉపాధ్యాయుల రక్తదానం
నవతెలంగాణ – కామారెడ్డి
పీఆర్టియూ టిఎస్ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పిఆర్టియు భవన్‌లో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుశాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 153 మంది ఉపాధ్యాయులు, పిఆర్టియు నాయకులు రక్తదానం చేసి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. “పిఆర్టియు సంఘం ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ అనేక విజయాలు సాధించడమే కాకుండా, సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడే అవకాశాన్ని కల్పిస్తున్న పిఆర్టియు సేవాభావం అభినందనీయం. గతంలో వరద సహాయ నిధికి రూ.7 లక్షలు విరాళంగా అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను మరింత పెంపొందిస్తాయి” అని తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ( డీఈవో ) రాజు మాట్లాడుతూ “పిఆర్టియు సంఘం 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజ సేవను కూడా లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న మాట్లాడుతూ పిఆర్టియు సంఘం గత ఆరు సంవత్సరాలుగా నిరంతరంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రెండు సార్లు గవర్నర్ ప్రశంసలు అందుకోవడం గర్వకారణం మణి తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదానం అత్యంత అవసరమైంది” అని పేర్కొన్నారు. రక్తదాన శిబిరం అనంతరం ఇటీవల పదవీ విరమణ పొందిన పిఆర్టియు సంఘం ఉపాధ్యాయులను జిల్లా పిఆర్టియు శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుశాల్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, పిఆర్టియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



